అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
నియోజకవర్గ అభివృద్ధి సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ హైమావతి
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి మంగళవారం హుస్నాబాద్ మున్సిపల్ కౌన్సిల్ కార్యాలయంలో హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాల పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్డీవో రామ్మూర్తి, డిఆర్డిఓ జయదేవ్ ఆర్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సమావేశానికి ముందు కలెక్టర్ హైమావతి మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు కొత్త బట్టల పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా అన్ని శాఖల పనులు వేగంగా పూర్తి కావాలని సూచించారు. హుస్నాబాద్ నుండి కొత్తపల్లి వరకు నాలుగు వరుసల రోడ్డు నిర్మాణంలో చెట్ల తొలగింపు 90 శాతం పూర్తయిందని, మిగతా పనులు ఎలక్ట్రిక్ లైన్ తొలగింపుతో సహా జాగ్రత్తగా పూర్తి చేయాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. కోహెడ–సముద్రాల రోడ్ బీటీ పనులు 15 రోజుల్లో పూర్తి చేయాలని, అలాగే హుస్నాబాద్–రామవరం, అక్కన్నపేట–కొత్తకొండ రోడ్ నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు. పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ శాఖ కింద ఎంఎన్ ఆర్ ఈజీఎస్ పథకం ద్వారా గ్రామపంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, కాంపౌండ్ వాల్ నిర్మాణాలు జరుగుతున్నాయని, వీటిని డిసెంబర్ చివరి నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు. గాంధీనగర్, పొట్లపల్లి, మహమ్మదాపూర్, బల్లునాయక్ తండా తదితర గ్రామాల్లో భూమి సమస్య ఉన్న చోట ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించి పనులు ప్రారంభించాలన్నారు.
మున్సిపల్ పరిధిలో జంక్షన్ డెవలప్‌మెంట్, ఎల్లమ్మచెరువు రోడ్ నిర్మాణం, సుందరీకరణ పనులు నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యుత్ శాఖ అధికారులు ఉపకేంద్రాల పనులను త్వరగా పూర్తి చేసి వినియోగానికి సిద్ధం చేయాలని సూచించారు. మిషన్ భగీరథలో తాగునీటి సరఫరా పనులు పూర్తి చేయాలని, పి హెచ్ సి, సబ్సెంటర్ భవనాలు, రిపేర్ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని తెలిపారు. రైతులను ఆయిల్ ఫామ్ సాగుకు ప్రోత్సహించి, వ్యవసాయ మరియు ఉద్యాన శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ హైమావతి సూచించారు.





