హుస్నాబాద్‌లో మొంథా తుఫాన్ బీభత్సం!…
వేల ఎకరాల్లో పంట నష్టం – రోడ్లు, కల్వర్టులు ధ్వంసం
గల్లంతైన దంపతుల గాలింపుకు రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరం
వరద ప్రాంతాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ సుడిగాలి పర్యటన
రేపు సీఎం రేవంత్ ఏరియల్ సర్వే
జాతీయ విపత్తుగా ప్రకటించి కేంద్రం సహాయం చేయాలి..
ప్రభుత్వం ప్రతి బాధితునికి అండగా ఉంటుంది – మంత్రి

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో మొంథా తుఫాన్ ప్రళయాన్ని సృష్టించింది. బుధ, గురువారాల్లో కురిసిన భారీ వర్షాలతో వాగులు, చెరువులు ఉప్పొంగి ప్రవహించడంతో రోడ్లు, కల్వర్టులు ధ్వంసమయ్యాయి. వేల ఎకరాల్లో నిల్వ ఉన్న పంటలు వరద నీటిలో మునిగిపోయాయి. రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. మార్కెట్ యార్డుల్లో రైతులు తెచ్చిన ధాన్యం వరదలో కొట్టుకుపోయింది. గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
మంత్రి పొన్నం ప్రభాకర్ సుడిగాలి పర్యటన
వరద తీవ్రతను స్వయంగా పరిశీలించేందుకు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం హుస్నాబాద్ నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేశారు. అక్కన్నపేట మండలం మోత్కులపల్లె వాగు దాటుతుండగా గల్లంతైన భార్యాభర్తలు ప్రణయ్, కల్పన ఆచూకీ కోసం జరుగుతున్న గాలింపు చర్యలను ఆయన పరిశీలించారు. గల్లంతైన 24 గంటలు గడిచినా వారిని కనుగొనలేకపోవడంతో చీఫ్ సెక్రటరీ రామకృష్ణతో మంత్రి మాట్లాడి రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరగా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రేపు ఉదయం నుంచే గాలింపు చర్యల్లో పాల్గొననున్నాయి. కలెక్టర్, పోలీస్ కమిషనర్ ఘటనాస్థలంలోనే ఉండి ఆపరేషన్ పర్యవేక్షణ చేయాలని మంత్రి ఆదేశించారు. గల్లంతైన కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించి, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.
ధాన్యం నష్టపోయిన రైతులకు మంత్రి పరామర్శ
హుస్నాబాద్ మార్కెట్ యార్డులో వరద నీటికి ధాన్యం కొట్టుకుపోయిన పరిస్థితిని మంత్రి దగ్గరగా పరిశీలించారు. మహిళా రైతు వీరవ్వ ధాన్యం పూర్తిగా నష్టపోవడంతో కన్నీటి పర్యంతమయ్యారు. ఆమెకు మంత్రి తక్షణ సహాయంగా ₹10,000 అందజేశారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులకు ఉపశమనం కల్పించాలని అధికారులను ఆదేశించారు.
రోడ్లు, కల్వర్టుల పరిశీలన
బస్వాపూర్–పోరెడ్డిపల్లి, అక్కెనపల్లి–మోయ తుమ్మెద రహదారులు తెగిపోవడంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ప్రాంతాలను మంత్రి ప్రత్యక్షంగా పరిశీలించారు. “గత ఆరు దశాబ్దాల్లో ఇంత భారీ వరదను చూడలేదు” అని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేయగా, తెగిన రోడ్లు, కూలిన బ్రిడ్జిలు, కల్వర్టులు త్వరితగతిన పునర్నిర్మిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి కల్వర్టు వద్ద వరదకు కొట్టుకుపోయి మృతి చెందిన అప్పని నాగేంద్రం కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు. గట్ల నర్సింగాపూర్ వద్ద తెగిన కల్వర్టును కూడా ఆయన పరిశీలించారు.
సీఎం రేవంత్ రేపు ఏరియల్ సర్వే
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ –
“హుస్నాబాద్ నియోజకవర్గంలో ఇంత భారీ నష్టం ఎప్పుడూ జరగలేదు. ఈ తుఫాన్ రాష్ట్రంలో అరుదైన విపత్తు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి పరిస్థితిని వివరించాను. రేపు సీఎం స్వయంగా హుస్నాబాద్, హనుమకొండ, వరంగల్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయనున్నారు” అని తెలిపారు.
జాతీయ విపత్తుగా ప్రకటించాలి
“హుస్నాబాద్‌లో జరిగిన నష్టం అపారమైనది. దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి రాష్ట్రానికి కేంద్రం తక్షణ సహాయం అందించాలి. రాజకీయాలకు అతీతంగా రైతులకు, ప్రజలకు అండగా ఉంటాం. ప్రభుత్వం ప్రతి బాధితునికి అండగా ఉంటుంది,” అని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.






