పత్తి రైతులకు శాపంగా సీసీఐ నిబంధనలు
బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున రెడ్డి
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్
పత్తి కొనుగోలు కేంద్రాల్లో సిసిఐ అధికారులు అమలు చేస్తున్న కఠిన నిబంధనల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం హుస్నాబాద్ ఆర్‌డిఓ రామమూర్తి కి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ…. పత్తి పంటను భారీ పెట్టుబడులతో పండించిన రైతులు సిసిఐ కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లినప్పుడు తేమ శాతం, నాణ్యత పేరుతో అధికారులు అనేక నిబంధనలు విధించడం రైతులకు శాపంగా మారిందని తెలిపారు. వాతావరణ మార్పుల కారణంగా తేమ శాతం తగ్గడం సహజమైతే, ఈ అంశాన్ని పట్టించుకోకుండా కఠిన ప్రమాణాలు పెట్టడం రైతులను నష్టాల్లోకి నెడుతోందని వారు ఆక్షేపించారు. అదనంగా, ఎకరానికి ఏడు క్వింటాళ్ల వరకు మాత్రమే కొనుగోలు చేస్తామన్న షరతు రైతులకు మరింత భారంలా మారిందని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు పంటను పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌లో నమోదు చేయకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు మరింత పెరిగాయని పేర్కొన్నారు.
హుస్నాబాద్ పత్తి మిల్లులో నెలరోజుల క్రితం ప్రారంభించిన సిసిఐ కొనుగోలు కేంద్రం ఇప్పటివరకు రెండు వేల క్వింటాళ్లు కూడా కొనుగోలు చేయకపోవడం తీవ్రమైన నిర్లక్ష్యమని మల్లికార్జున్రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ కొనుగోలు నిలిచిపోవడంతో రైతులు బలవంతంగా ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకే పత్తిని అమ్ముకోవాల్సి వస్తోందని, దీంతో నిలువ దోపిడీ జరుగుతోందని పేర్కొన్నారు. రైతులను ఆదుకోవడం ప్రభుత్వ ధర్మమని, కనీసం ఇప్పటికైనా సిసిఐ నిబంధనలను సడలించి రైతులకు తక్షణ ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున రెడ్డి, సీనియర్ నాయకులు సూరంపల్లి పర్శరాములు, అయిలేని గౌల్ రెడ్డి, బత్తుల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.





