జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం
గ్రామ గ్రామాన సంబరాలకు పిలుపునిచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట టైమ్స్ హైదరాబాద్:
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో సాధించిన విజయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన జరుపుకుందామని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఈ గెలుపు ప్రజా పాలన ప్రభుత్వంపై ప్రజలు ఉంచిన నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజల కోసం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పథకాలు ఈ విజయానికి కారణమని మంత్రి వెల్లడించారు. “రైతులకు అండగా ఉచిత విద్యుత్, పేదలకు సన్నబియ్యం, రేషన్ కార్డులు, సున్నా వడ్డీ రుణాలు, ఉద్యోగాలు, రుణమాఫీ, రైతు భరోసా… ఇలా అనేక పథకాల ద్వారా గ్రామీణ ప్రజలకు సహాయాన్ని అందిస్తున్నాం” అని తెలిపారు.
అంతేకాక, బీఆర్‌ఎస్–బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ప్రజలు కాంగ్రెస్‌పక్షాన నిలబడ్డారని మంత్రి మండిపడ్డారు. జూబ్లీహిల్స్‌లో వచ్చిన గెలుపు పార్టీ కార్యకర్తల కృషికి ప్రతిఫలమని, ఈ విజయాన్ని ప్రతి కార్యకర్త తమ గెలుపుగా భావించి తమ తమ గ్రామాల్లో సంబరాలు నిర్వహించాలని కాంగ్రెస్ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ విజయం రాష్ట్రంలో ప్రజా పాలనకు ప్రజలు ఇచ్చిన మద్దతు అని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.






