హుస్నాబాద్‌ మున్సిపల్‌ పీఠం కాంగ్రెస్‌ కైవసం

హుస్నాబాద్‌ మున్సిపల్‌ పీఠం కాంగ్రెస్‌ కైవసం

హుస్నాబాద్‌ మున్సిపల్‌ పీఠం కాంగ్రెస్‌ కైవసం


చైర్‌పర్సన్‌గా దండి లక్ష్మి, వైస్‌ చైర్‌పర్సన్‌గా చిత్తారి పద్మ ఏకగ్రీవ ఎన్నిక


సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్‌:

హుస్నాబాద్‌ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ జెండా రెపరెపలాడింది. పట్టణ ప్రథమ పౌరురాలిగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 14వ వార్డు సభ్యురాలు దండి లక్ష్మి కొమురయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్‌ చైర్‌పర్సన్‌గా 7వ వార్డు సభ్యురాలు చిత్తారి పద్మ రవీందర్‌ ఎన్నికయ్యారు. సోమవారం మున్సిపల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఎన్నికల అధికారి, ఆర్డీవో రామ్మూర్తి నూతన పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు.


ఉత్సాహంగా ఎన్నికల ప్రక్రియ
ఈ సమావేశానికి మున్సిపాలిటీలోని 20 మంది వార్డు సభ్యులతో పాటు ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఉదయం మంత్రి తన క్యాంపు కార్యాలయం నుంచి నూతన సభ్యులతో కలిసి బస్సులో మున్సిపల్ కార్యాలయానికి చేరుకోవడంతో సందడి నెలకొంది. తొలుత కాంగ్రెస్‌కు చెందిన 16 మంది, బీఆర్‌ఎస్‌కు చెందిన నలుగురు సభ్యులతో ఆర్డీవో ప్రమాణ స్వీకారం చేయించారు.


ఏకగ్రీవం ఇలా..
అనంతరం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో చైర్‌పర్సన్ పదవికి దండి లక్ష్మి పేరును సభ్యురాలు చెన్నమేని అనూష ప్రతిపాదించగా.. ఆకుల రజిత, కేశవేని రమేష్, శోభన్ బాబు బలపరిచారు. వైస్‌ చైర్‌పర్సన్‌ పదవికి చిత్తారి పద్మ పేరును పిల్లి తిరుపతి ప్రతిపాదించగా.. వరప్రసాద్, బొలిశెట్టి రాజు, వైద్యం కిరణ్ ప్రసాద్‌లు బలపరిచారు. ఇతర అభ్యర్థులెవరూ పోటీలో లేకపోవడంతో వీరిద్దరి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఆర్డీవో ప్రకటించి, వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. పట్టణాభివృద్ధికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *