రేపు వరంగల్, హుస్నాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే
తుఫాన్ ప్రభావంపై సీఎం వీడియో కాన్ఫరెన్స్…
వరద బాధితులకు తక్షణ సహాయం అందించాలని ఆదేశం
అన్ని విభాగాలు అప్రమత్తంగా పనిచేయాలని సీఎం సూచన

సిద్దిపేట టైమ్స్ వెబ్ డెస్క్ :
మొంథా తుపాను ప్రభావంతో వరంగల్, హనుమకొండ, సిద్ధిపేట, హుస్నాబాద్ తదితర ప్రాంతాలు తీవ్ర వర్షాలు, వరదలతో ముంచెత్తిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర చర్యలను ప్రారంభించింది. వరద బాధితులను రక్షించేందుకు సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఈరోజు మంత్రులు, కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితులను సమీక్షించారు. వరద ప్రభావిత ప్రాంతాలకు వెంటనే పడవలు పంపించాలని, అవసరమైన చోట ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని తరలించాలని ఆదేశించారు. హైడ్రా వద్ద ఉన్న వరద సహాయక సామగ్రిని వినియోగించి తక్షణ సహాయం అందించాలన్నారు. ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు డ్రోన్ల ద్వారా ఆహారం, మంచినీరు పంపిణీ చేయాలని సూచించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తతతో పనిచేయాలని ఆదేశించారు.
వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈరోజు తలపెట్టిన వరంగల్ పర్యటనను వాయిదా వేసుకున్న ముఖ్యమంత్రి, గురువారం వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రతి బాధిత కుటుంబానికి అవసరమైన సహాయం అందించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు.





