ఎల్లమ్మ చెరువులో స్వచ్ఛత హి సేవ కార్యక్రమం
తడి చెత్తతో ఎరువుల తయారీ – పర్యావరణ పరిరక్షణపై కమిషనర్ సూచనలు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్, అక్టోబర్ 1 :

స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా హుస్నాబాద్ పురపాలక సంఘ కమిషనర్ టి. మల్లికార్జున్ ఆధ్వర్యంలో ఎల్లమ్మ చెరువులో బతుకమ్మ నిమజ్జనం పాయింట్ వద్ద శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మున్సిపల్ సిబ్బందితో కలిసి చెరువులో మిగిలిన బంతి పూలు, గునుగు పువ్వులు మరియు ఇతర తడి వ్యర్థాలను తొలగించి ట్రాక్టర్ ద్వారా కంపోస్ట్ షెడ్‌కు తరలించారు. ఆయన మాట్లాడుతూ, చెరువులో సేకరించిన ఈ తడి వ్యర్థాలతో ఎరువును తయారు చేసి మొక్కలకు వాడుకునేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
అలాగే పట్టణ ప్రజలు తడి చెత్త – పొడి చెత్త వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందించాలి అని సూచించారు. దీనివల్ల చెత్త నిర్వహణ సులభతరం కావడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుందని ఆయన వివరించారు. ప్రజలందరూ శుభ్రత కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని, పరిశుభ్రమైన హుస్నాబాద్ పట్టణ నిర్మాణానికి తోడ్పడాలని పురపాలక కమిషనర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ బాల ఎల్లం, పర్యావరణ అధికారి రవికుమార్, వార్డ్ ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు, జవాన్లు సారయ్య, ప్రభాకర్, మెప్మా రిసోర్స్ పర్సన్స్, శానిటేషన్ సిబ్బంది మరియు ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.





