దేశానికే మార్గదర్శకంగా కుల గణన సర్వే
ఇంటికి పరిమితమైన బీ ఆర్ ఎస్ సర్వే
మతం పేరుతో ఓటు రాజకీయం చేస్తున్న బీజేపి
హుస్నాబాద్ లో విలేకరుల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ ;
నిర్ణయం నుండి నివేదిక వరకు తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఒక మార్గదర్శకంగా ఉండే విధంగా కుల గణన సర్వే చేపడితే బీజేపి , బీఆర్ఎస్ పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులు సమాచార సేకరణ చేసి కోటి 12 లక్షల ఇల్లు తిరిగి సర్వే నిర్వహించి శాసనసభలో చర్చకు పెడితే కుల సర్వే పై సమాచారం ఇవ్వనివారు, సభ నుండి నిరసన తెలిపి వాకౌట్ చేసిన వారు కూడా బలహీనవర్గాల మీద ఏం హక్కు ఉందని మాట్లాడుతున్నారని అన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ప్రతిపక్ష నేత కేసిఆర్ ఉపపక్ష నాయకులు హరీష్ రావు ఒక్క పదవి అయినా బీసీలకు, ఎస్సీలకు ఇచ్చారా అని ప్రశ్నించారు. బీజెపి బీసీని ముఖ్యమంత్రి చేస్తానని చివరికి శాసనసభ పక్ష నాయకుడిని కూడా రెడ్డిని చేశారని ఎద్దేవా చేశారు. దేశంలో మతం పేరు మీద విధ్వంసం సృష్టించి ఓట్ల రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నారు. రామాలయాన్ని ఎన్నికల కోసం వాడుకున్న బీజేపీకి బలహీన వర్గాల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. 1931లో కుల సర్వే జరిగింది అని గుర్తు చేస్తూ 2011లో జనాభా లెక్కలు జరిగాయని 2021లో కరోనా వల్ల జరగాల్సింది ఇప్పుడు జరిగాయన్నారు. ఎవరు ఎంతో వారికంత అనే విధంగా చేస్తామని మొన్నటి వరకు కుల సర్వే కు అంకెలు లేవని ఇప్పుడు సమగ్రంగా అంకెలు వచ్చాయని 56% బీసీల లెక్క తేలిందని అన్నారు. శాస్త్రీయంగా చట్టబద్ధంగా నిర్ణయం నుండి నివేదిక వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కుల సర్వేలో పారదర్శకత పాటించిందని ఇందులో ఎలాంటి అనుమానాలకు తావు లేదని పేర్కొన్నారు.