హుస్నాబాద్ పట్టణంలో జీఎస్టీ పన్ను తగ్గింపుపై బిఎస్పీ పార్టీ పరిశీలన
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ను జీఎస్టీ పరిధి నుండి తొలగించాలి
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ :
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ను జీఎస్టీ పరిధి నుండి తొలగించాల్సిన అవసరం ఉందని బిఎస్పీ పార్టీ డిమాండ్ చేసింది. నిన్నటి నుండి అమలులోకి వచ్చిన జీఎస్టీ పన్ను తగ్గింపు విషయమై ఈరోజు హుస్నాబాద్ పట్టణంలోని వివిధ దుకాణాలు, సూపర్ మార్కెట్లు, మార్ట్ లలో పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. 48 గంటలు గడిచినా ఇంచుమించు పాతధరలతోనే పలు దుకాణాలు వస్తువులు విక్రయిస్తున్నట్లు వారు గుర్తించారు. సిమెంట్, ఐరన్, మందుల షాపుల్లో కూడా పెద్దగా ధరల తగ్గింపు కనిపించలేదని వారు తెలిపారు. బట్టలు ఉతికే సబ్బులు, డిటర్జెంట్ పౌడర్ వంటి వినియోగ వస్తువులకు జీఎస్టీ తగ్గింపు లేకపోవడం సాధారణ ప్రజలకు ఉపయోగం కలిగించలేదని పేర్కొన్నారు.
మోడీ ప్రభుత్వం ఒక కుటుంబానికి నెలకు 20 వేల రూపాయలు ఆదా అవుతుందని చెప్పినా, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని బిఎస్పీ నేతలు విమర్శించారు. నిజానికి పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను పది సంవత్సరాల క్రితం ఉన్న స్థాయికి తగ్గిస్తే ప్రతి కుటుంబం నెలకు కనీసం 10 వేల రూపాయలు ఆదా చేసుకోగలదని వారు అభిప్రాయపడ్డారు. అలాగే వంట నూనెను కూడా జీఎస్టీ పరిధి నుండి తప్పించాల్సిన అవసరం ఉందని సూచించారు. జీఎస్టీ పేరుతో గత 10 సంవత్సరాల్లో ప్రజల నుండి వసూలు చేసిన లక్షల కోట్ల రూపాయలను రాష్ట్ర అభివృద్ధి కోసం తిరిగి ఇవ్వాలని బిఎస్పీ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బిఎస్పీ పార్టీ ఇంచార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్, జిల్లా నాయకులు ఎలగందుల శంకర్, పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు వేల్పుల రాజు, జేరిపోతుల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.





