ఎట్టకేలకు గల్లంతైన యువ దంపతుల మృతదేహాలు లభ్యం
వాగులో కొట్టుకుపోయి మరో యువకుడు మృతి
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ :


అక్కన్నపేట మండలంలో మోత్కులపల్లె వాగులో గల్లంతైన యువ దంపతుల మృతదేహాలు లభ్యం కావడమే కాక మరో యువకుడు వాగులో కొట్టుకుపోయి మృతిచెందాడు. దీంతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి.
వివరాల్లోకి వెళ్తే… రెండు రోజుల క్రితం గల్లంతైన యువ దంపతులు ప్రణయ్, కల్పన మృతదేహాలు కూడా శుక్రవారం ఉదయం లభించాయి. మల్లంపల్లి చెరువు కు పెద్ద తండా సమీపంలో ఉన్న ఒడ్డుకు మృతదేహాలు కొట్టుకు వచ్చినట్లు తెలుస్తోంది. సుమారు రెండు కిలోమీటర్ల మేరకు వాగు ఉధృతిలో ప్రాణాలతో కొట్టుకుపోయిన మృతదేహాలు చివరికి శవాలై తేలడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. రెండు రోజుల నిరీక్షణ అనంతరం దొరికిన మృతదేహాల వద్ద బంధువులు కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి గ్రామానికి చెందిన కల్పన, ప్రణయ్ లు బుధవారం రాత్రి భీమదేవరపల్లి నుండి అక్కన్నపేటకు వెళుతున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. కాగా కల్పన బర్త్ డే డెత్ డే గా మారడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. అక్కన్నపేటలో ఉన్న చెల్లె, అమ్మ మధ్యలో పుట్టినరోజు జరుపుకోవాలని తలచి ఇలా జరగడంతో అటు అక్కన్నపేట ఇటు భీమదేవరపల్లి లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇక, మల్లంపల్లి గ్రామానికి చెందిన పూల్లూరి రామకృష్ణ (27) గురువారం రాత్రి మల్లంపల్లి–గొల్లపల్లి మధ్య వాగు దాటుతుండగా ఆకస్మికంగా పెరిగిన నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. రాత్రంతా గాలింపు చేసిన పోలీసులు, గ్రామస్తులు శుక్రవారం ఉదయం అతని మృతదేహాన్ని వాగులో కనుగొన్నారు. రామకృష్ణ మృతి వార్తతో గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది.





