భూమి ఒక్కటే పాస్ బూక్కులు మూడు..
ధరణితో గందరగోళం..
అమాయకుల ఆగమాగం..
సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట ప్రతినిధి.
ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఒక సర్వే నంబర్ లో ఉన్న భూమి విస్తీర్ణం కన్నా అదే సర్వే నంబర్ ద్వారా పొందిన పాసుబుక్కు ల విస్తీర్ణం ఎక్కువ ఉండడంతో భూమి సమస్యలు సిద్దిపేట జిల్లాలో పెరుగుతున్నాయి. సమగ్ర భూమి రికార్డుల కోసం ప్రవేశపెట్టిన ధరణి పథకం కూడా ఈ సమస్యల చిక్కులను విడగొట్టలేదు. ఫలితంగా తరచుగా భూ వివాదాలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు ఇది శాంతి భద్రతల సమస్యగా పరిణమిస్తుంది. ఈ నేపథ్యంలో కొందరు అమాయకులు మోసాలకు గురవుతున్నారు.

దశాబ్దాలుగా భూమి రికార్డుల్లో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించడానికి ధరణి పథకాన్ని గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కాగా అధికార యంత్రాంగం , పాలకులు ఏ ఏ సర్వే నంబర్లలో ఎంత భూమి ఉన్నది ? అందుకు అనుగుణంగా భూ యజమానులకు పాసుబుక్కులు ఇచ్చిన విషయం లోతుగా అధ్యయనం చేసి పథకాన్ని రూపొందిస్తే బాగుండేది. కాగా ఈ విషయంలో సమగ్ర విచారణ జరపకుండానే పాత భూ యజమానులకు సంబంధించి విడుదలైన పాసుబుక్కుల ప్రకారం ప్రకారం కొత్త పాస్ బుక్ లు ఇచ్చారు. అయితే కొన్ని ప్రాంతాల్లో వాస్తవంగా ఉన్న భూమి కన్నా విడుదల చేసిన పాసుబుక్కుల భూమి విస్తీర్ణం ఎక్కువగా ఉండడంతో ఈ సమస్య సంపూర్ణంగా పరిష్కారం కాలేదు. ఈ క్రమంలో భూముల విలువ లు పెరిగాయి. భూముల క్రయవిక్రయాలు పెరిగాయి. ఫీల్డ్ మీదికి వెళ్లి చూస్తే ఒక సర్వే నంబర్ విస్తీర్ణం కన్నా ఎక్కువ విస్తీర్ణంలో పాసుబుక్కులు విడుదలైనట్లు తెలవడం తో భూమి తమదేనని ఒక్కరి కన్నా ఎక్కువమంది తమ పాసుబుక్కులను చూపిస్తూ పంచాయతీలకు దిగుతున్నారు. ఈ క్రమంలో ఈ విషయాలు తెలియకుండా భూమి కొనుగోలు చేసిన వారు భూమి కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకోలేకపోతున్నారు. ఇచ్చిన అడ్వాన్సులను పొందలేకపోతున్నారు. అధికార బలం ఉన్న వారు మాత్రం ఏదో విధంగా అడ్వాన్సులను రాబట్టుకుంటున్నారు. మిగిలినవారు వివాద భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోలేక , అడ్వాన్సు రాబట్టుకోలేక ఇబ్బందులకు గురవుతున్నారు.

సిద్దిపేట పట్టణంలోని కరీంనగర్ రోడ్డులో ఉన్న పత్తి మార్కెట్ సమీపంలో సర్వేనెంబర్ 894 లో ఏర్పడుతున్న వివాదం ఒక ఉదాహరణ. ఈ సర్వే నంబర్లు 12 గుంటల స్థలము ఉన్నది .కాగా ముగ్గురు వ్యక్తులపై సుమారు 40 గుంటల స్థలం ఉన్నట్లు పాస్బుక్కులు విడుదలయ్యాయి. ప్రధాన సర్వేనెంబర్ కు అదనంగా కొన్ని అంకెలు , కొన్ని అక్షరాలను చేర్చి పాసుబుక్కులను విడుదల చేస్తున్నారు. పాస్ బుక్కులు పొందిన వారు నిర్నితంగా ఉన్న స్థలం తమదేనుని ఎవరికి వారు భూమిపై తమకు హక్కులు ఉన్నాయని భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఎవరికి వారు భూమిని విక్రయించుకుంటున్నారు. ఈ భూమి ప్లాట్లుగా విభజించకపోవడంతో కొనుగోలుదారులకు హద్దులు కనిపించడం లేదు.ఈ విషయం తెలియని అమాయకులు భూమి కొనుగోలు చేసి భారీ మొత్తంలో అడ్వాన్సులు చెల్లించారు .భూమి పైకి వెళ్ళినప్పుడు ఇతరులు వచ్చి ఇది తమ భూమి ఆని , తమ వద్ద పాస్ బుక్కులు ఉన్నాయని చెప్పడంతో ఆశ్చర్య పోవాల్సి వస్తుంది. విచారణ కోసం రెవెన్యూ ఆఫీసు చుట్టూ నెలల తరబడి తిరుగుతున్నప్పటికీ ఫలితం కనిపించక పరేషాన్ అవుతున్నారు. రిజిస్ట్రేషన్ ఆఫీసులో సర్వేనెంబర్ భూమికి సంబంధించి ఈసీలు తీసుకుంటే అందులో ఉన్న రికార్డులకు , రెవెన్యూ వద్ద ఉన్న పహాని రికార్డులకు తేడాలు ఉంటున్నాయి. నెలల తరబడి తిరుగుతున్న ఫలితం కనిపించడం లేదు. అడ్వాన్స్ వాపస్ ఇవ్వమని అడిగితే తమ రికార్డు సరైనదని , అడ్వాన్స్ వాపస్ ఇవ్వమని వారు మొండికేస్తున్నారు.ఈ విషయంలో రెవెన్యూ అధికారులు సమగ్ర విచారణ జరిపి జిల్లాలో ఎక్కడ కూడా భూమి వివాదాలు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుకుంటున్నారు.
