రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహనే ఆయుధం
యూనిసెఫ్ ఆధ్వర్యంలో ఆర్టీఏ సభ్యులకు రోడ్డు భద్రతా శిక్షణ
ప్రజల్లో క్యాష్ లెస్ ట్రీట్మెంట్ పై అవగాహన కల్పించాలి – మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట టైమ్స్ వెబ్ డెస్క్:
రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు రవాణా శాఖ కృషి ప్రారంభించింది. ఈ క్రమంలో యూనిసెఫ్ ఆధ్వర్యంలో హోటల్ మెర్క్యూరీ లో రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ నాన్ ఆఫీసియల్ మెంబర్స్ (ఆర్టీఏ మెంబర్స్) కి రోడ్డు భద్రత, ప్రజల్లో అవగాహన కల్పించే అంశాలపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, “ప్రతి రోజూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టడం సమాజ బాధ్యత. రవాణా శాఖ అధికారులు, ఆర్టీఏ సభ్యులు కిందిస్థాయిలో సమన్వయం చేసుకుంటూ గ్రామీణ ప్రాంతాల నుండి రాజధానివరకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి” అని తెలిపారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, “కేంద్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి క్యాష్ లెస్ ట్రీట్మెంట్ విధానాన్ని అమలు చేస్తోంది. గాయపడిన వారికి 8 రోజుల్లో ₹1.50 లక్షల వరకు చికిత్స ఖర్చులు అందిస్తారు. దీనిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది” అని పేర్కొన్నారు. ఇటీవల చోటుచేసుకున్న కర్నూలు, చేవెళ్ల బస్సు ప్రమాదాల నేపథ్యంలో రోడ్డు భద్రతపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. స్కూలులు, కాలేజీలు, విద్యాసంస్థల్లో రోడ్డు నిబంధనలపై వ్యాసరచన పోటీలు, ర్యాలీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేయాలని, ప్రమాదాల నివారణకు ప్రజా భాగస్వామ్యం అవసరమని ఆయన అన్నారు.
యూనిసెఫ్ ప్రతినిధి డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ, “గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ రిపోర్ట్ ప్రకారం 10–19 సంవత్సరాల వయసులో మరణిస్తున్న వారిలో ఎక్కువ మంది రోడ్డు ప్రమాదాల వలననే ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు యూనిసెఫ్ భారత్‌లో అహ్మదాబాద్, ముంబై, హైదరాబాద్ నగరాలను ఎంపిక చేసింది” అని వెల్లడించారు. దేశంలో రోజుకు సగటున 1317 రోడ్డు ప్రమాదాలు, 477 మరణాలు సంభవిస్తున్నాయని వివరించారు.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డీన్ డాక్టర్ శైలజ మాట్లాడుతూ, “విద్యార్థి దశ నుంచే రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించాలి. స్కూల్‌ల్లో ‘ఆక్టివ్ బ్లీడింగ్ కంట్రోల్ ప్రోగ్రాం’ వంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టడం ద్వారా ప్రవర్తనలో మార్పు తీసుకురావాలి” అని సూచించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి హాజరైన ఆర్టీఏ నాన్ ఆఫీసియల్ మెంబర్స్, యూనిసెఫ్ ప్రతినిధులు, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.





