హుస్నాబాద్‌లో ఆశా వర్కర్ల అరెస్టు.. బీఆర్ఎస్ శ్రేణుల సంఘీభావం
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించిన ఆశా వర్కర్లను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తుండగా మార్గమధ్యంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా అరెస్టు అయిన వారికి బీఆర్ఎస్ నాయకులు సంఘీభావం ప్రకటించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రతినిధులు సుద్దాల చంద్రయ్య, అయిలేని మల్లికార్జున్ రెడ్డి, సూరంపల్లి పరశురామ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని ఉద్యమాలను అణచివేయలేదని హెచ్చరించారు. ఎన్నికల హామీలను విస్మరించిన ప్రభుత్వం, కనీస వేతనం కోరుతున్న ఆశ కార్యకర్తలను చర్చలకు పిలవకుండా నిర్బంధించడం దుర్మార్గమన్నారు. నిరంతరం ప్రజల సేవలో గడుపుతున్న వారిని భయభ్రాంతులకు గురిచేయడం ప్రజా పరిపాలన అనిపించుకోదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆశా వర్కర్ల పక్షాన బీఆర్ఎస్ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు వికాస్ యాదవ్, యాస శ్రీనివాస్, ఆశా కార్యకర్తలు భాగ్య, వాణి తదితరులు పాల్గొన్నారు.




