రాహుల్, ప్రియాంక ల అరెస్ట్ ప్రజాస్వామ్యంపై దాడి: మంత్రి పొన్నం
ఓటు చోరీపై ప్రశాంతంగా నిరసన చేసిన ప్రతిపక్ష నేతలను విడుదల చేయాలని, ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్
సిద్దిపేట టైమ్స్ డెస్క్:
లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీలను అరెస్ట్ చేయడాన్ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. ఓటు చోరీపై ప్రశాంత నిరసన చేసిన ప్రతిపక్ష నేతలను విడుదల చేయాలని, ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలని బీజేపీ ప్రభుత్వాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.
రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా భారత్ జోడో – నఫ్రత్ చోడో యాత్రల ద్వారా ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్నారని, ఓటర్ల జాబితాలో అవకతవకలపై ప్రశాంతంగా ఈసీకి వినతిపత్రం సమర్పించాలనుకున్న సమయంలోనే అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని ఆయన అన్నారు.
“ఓటర్ల జాబితాలోని లోపాలపై మాట్లాడితే భరించలేని బీజేపీ, నిరసన వ్యక్తం చేసే అవకాశాన్నే తొలగించింది. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే చర్య. వెంటనే వారందరినీ విడుదల చేసి, నిరసన తెలిపే హక్కును కల్పించాలి,” అని మంత్రి డిమాండ్ చేశారు.
రాహుల్ గాంధీ లేవనెత్తిన ఓటు చోరీ అంశంపై ఎన్నికల సంఘం వెంటనే స్పందించి సరిదిద్దాలని ఆయన కోరారు. “ఇలాంటి అప్రజాస్వామిక చర్యలతో బీజేపీ ప్రభుత్వం తాత్కాలిక ఆనందం పొందవచ్చు కానీ, చివరికి ప్రజాస్వామ్యానికి నష్టం కలిగించే దిశగా ఇది తీసుకెళ్తుంది,” అని పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు.