యూరియా పంపిణి పై విచారణ జరిపించాలి…
వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం తో రైతులకు ఇబ్బందులు
బి ఆర్ యస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున రెడ్డి
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:.
హుస్నాబాద్ పట్టణంలో శుక్రవారం రోజు బీఆర్ఎస్ పార్టీ విలేకరుల సమావేశం జరిగింది. ఇందులో ఫర్టిలైజర్స్ దుకాణాల ఇష్టారాజ్యంపై, వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ— రైతులకు సరైన రీతిలో యూరియా అందకపోవడం ప్రధాన సమస్యగా మారిందని అన్నారు. రైతుల పాస్‌బుక్ జిరాక్స్‌పై అధికారులు సంతకాలు చేసి ఎరువుల షాపులకు పంపుతున్నా, రైతులు రోజులు తరబడి క్యూలో నిలబడినా ఒక్క బస్తా కూడా దొరకడం లేదని విమర్శించారు. ఫర్టిలైజర్స్ దుకాణ యజమానులు క్యూలో నిలబడిన రైతులకు ఇవ్వకుండా బయట వారికి యూరియా అమ్మడం, కొంత యూరియా నిల్వ చేసి బ్లాక్ మార్కెట్‌లో ఎక్కువ ధరలకు విక్రయించడం జరుగుతుందని ఆరోపించారు. ఈ అక్రమాలను అడ్డుకోవడంలో వ్యవసాయ శాఖ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని తెలిపారు. హుస్నాబాద్‌కు వచ్చిన యూరియా పంపిణీపై పూర్తి స్థాయి విచారణ జరపాలని, దుకాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని మల్లికార్జున రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. అలాగే, డివిజన్ స్థాయి వ్యవసాయ శాఖ అధికారి (ఏడీఏ) శాశ్వత నియామకం చేయకపోవడం వల్లనే పర్యవేక్షణ లోపిస్తోందని విమర్శించారు. “రైతులు ఇబ్బందులు పడకుండా కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి,” అని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మేకల వికాస్ యాదవ్, మాలోతు సత్యం నాయక్, భూక్యా కృష్ణ నాయక్, మాలోతు మోహన్ నాయక్, మూడవత్ శ్రీనివాస్, తిరుపతి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
Posted inహుస్నాబాద్
యూరియా పంపిణి పై విచారణ జరిపించాలి…





