ఇంజనీరింగ్ కళాశాల అభివృద్ధికి అన్ని సౌకర్యాలు – మంత్రి
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
హుస్నాబాద్ పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణలో వనమహోత్సవం సందర్భంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మొక్కలు నాటారు. అనంతరం నూతనంగా ఏర్పడిన శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులతో ముచ్చటించారు.
ఇంజనీరింగ్ కాలేజీలో మొదటి సంవత్సరం చేరిన విద్యార్థులకు మంత్రి శుభాకాంక్షలు తెలుపుతూ— “విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులకు, ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలి. కళాశాలలో ఇప్పటికే క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, హాస్టల్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఏ సమస్యలు ఉన్నా వెంటనే వీసీ గారికి లేదా నాకూ తెలియజేయాలి,” అని సూచించారు. హుస్నాబాద్‌కు ఇంజనీరింగ్ కాలేజీ రావడానికి చాలా కృషి జరిగిందని పేర్కొన్న ఆయన, 30 ఎకరాల్లో సొంత భవనాల నిర్మాణం త్వరలోనే ప్రారంభమవుతుందని, ముఖ్యమంత్రి చేతులమీదుగా శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు. పాలిటెక్నిక్ కళాశాలకు కూడా హాస్టల్ సౌకర్యం, రవాణా, సీసీ రోడ్డు వంటి సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు.
“ప్రభుత్వం ఇకపై ఇవ్వగలిగేది విద్య మాత్రమే. విద్యకు ప్రాధాన్యత ఇస్తూ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. విద్యార్థులు ప్రతి క్షణం నేర్చుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగాలి,” అని మంత్రి పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమవతి, అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, ఆర్డీవో రామ్మూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.





