బస్వాపూర్ మోయ తుమ్మెద వాగు వరద నీటిలో చిక్కుకున్న 8 మంది వలస కార్మికులను రెస్క్యూ చేసి సురక్షితంగా రైతు వేదికకు తరలించిన హుస్నాబాద్ ఏసిపి సతీష్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ లో ఎగువ నుండి వస్తున్న వరద నీటితో మోయతుమ్మెద వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. వాగు ఉధృతితో గ్రామంలో వాగు సమీపంలోని ఇండ్లలోకి వరదనీరు చేరింది. జాతీయ రహదారి పనులు చేయడానికి వచ్చి ఓ ఇంట్లో ఉంటున్న ఎనిమిది మంది యూపీ వలస కూలీలు వరద నీటిలో చిక్కుకున్న విషయాన్ని తెలుసుకున్న హుస్నాబాద్ ఏసిపి వాసాల సతీష్, హుటా హుటిన సంఘటన స్థలానికి వెళ్లి పోలీస్ సిబ్బంది, గ్రామస్తుల సహకారంతో 8 మందిని రెస్క్యూ చేసి బస్వాపూర్ రైతు వేదిక వద్దకు సురక్షితంగా తరలించారు. బస్వాపూర్ గ్రామ శివారులో వరద నీటిలో చిక్కుకున్న ఇళ్లలో గల ఐదు కుటుంబాలకు చెందిన కుటుంబ సభ్యులను కూడా బస్వాపూర్ రైతు వేదిక వద్దకు తరలించి అక్కడే వారికి భోజనం వసతిని కల్పించామని తెలిపారు. పోలీసుల సహాయంతో ప్రాణాలతో బయటపడ్డ కూలీలు ఏసీబీ సతీష్ కు, గ్రామస్థులకు కృతజ్ఞతలు తెలిపినారు.
బస్వాపూర్ మోయ తుమ్మెద వాగు ఉదృతంగా ప్రవహిస్తున్నందున వాగుకు ఇరువైపులా బ్లాక్ చేసి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, చుట్టుపక్కల గ్రామాల వారు ఎవరు కూడా ఆ వాగు ప్రదేశానికి, దరిదాపులోకి కూడా రావద్దని ఏసీపి ఒక ప్రకటనలో తెలిపారు.
