చేపల కోసం చెరువు ఖాళీ చేసిన చేపల కాంట్రాక్టర్…
అధికారుల అనుమతి లేకుండా కాంట్రాక్టర్ నిర్వాకం…
నీటిని వదిలేసిన వారిపై చర్యలు తీసుకోవాలి..
ఎల్లమ్మ చెరువు తూము దగ్గర నీటిని పరిశీలించిన హుస్నాబాద్ అఖిలపక్ష నాయకులు…



సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రమైన హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు నుంచి ప్రస్తుతం రైతులకు సాగునీటి అవసరం లేకున్నా ప్రధాన తూము ద్వారా నీటిని వదులుతున్నారని హుస్నాబాద్ అఖిలపక్ష నాయకులు ఈరోజు ఎల్లమ్మ చెరువును సందర్శించి నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ విషయంలో నీటిపారుదల శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. మత్స్యకారులు చేపలు పట్టుకోవడానికి తాము వ్యతిరేకం కాదన్నారు. చెరువులోని చేపలు పట్టేందుకు సంబంధిత కాంట్రాక్టర్ ఎవరి అనుమతులు లేకున్నా నీటిని ఖాళీ చేస్తున్నట్లు తెలిసింది. ఒక్కసారి ఎల్లమ్మ చెరువు నిండితే రెండు సంవత్సరాల పాటు ఎండిపోకుండా ఉంటుందని, దీంతో భూగర్భ జలాలు అడగంటకుండా చుట్టు పక్క గ్రామాల వ్యవసాయ బావులు, మంచినీటి బావుల్లో సమృద్ధిగా నీరు ఉంటుందని, అయితే చెరువులో నీరు ఉండడంతో చేపలు పట్టేందుకు ఇబ్బంది అవుతుందని చేపల కాంట్రాక్టర్ తీసుకున్న వ్యక్తి నీటి పారుదల శాఖ అధికారుల అనుమతులు లేకుండా తూము ద్వారా నీటిని వదులుతున్నాడని రైతులు తెలిపారు. ఈ విషయంపై ఇరిగేషన్ అధికారులను సంప్రదించగా.. తమ అనుమతులు లేకుండా తూము గేటు ఎత్తి నీటిని వదిలిన విషయం వాస్తవమేనని, దీనిపై విచారణ జరిపి సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. వెంటనే సదరు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష నాయకులు కోరారు.
ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ అఖిలపక్ష నాయకులు సహకార సంఘం చైర్మన్ బొలిశెట్టి శివయ్య, బి ర్ యస్ నాయకుడు మల్లికార్జున్ రెడ్డి, టీపీసీసీ సభ్యుడు కేడియం లింగమూర్తి, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, పుర మాజీ వైస్ చైర్మన్ బొలిశెట్టి సుధాకర్, కోఆప్షన్ సభ్యుడు శంకరరెడ్డి, బీజేపీ అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు బాతులశంకర్ బాబు, పట్టణ కార్యదర్శి తోట సమ్మయ్య, కిషన్ సాంగ్ జిల్లా ఉపాధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, రైతు సంఘం నాయకుడు రవీందర్ గౌడ తదితరులు పాల్గొన్నారు.