కన్న బిడ్డను అమ్మకానికి పెట్టిన కసాయి తల్లి..
తల్లి బిడ్డ బాలల సంరక్షణలో..
సిద్దిపేట టైమ్స్ దౌల్తాబాద్
నవ మాసాలు మోసిన తల్లి ప్రేమకే నే దూరమా… బువ్వపెట్టి నన్ను బుజ్జగించిన తల్లీ లాలనకు నేను దూరమా..! ఈ సృష్టిలో కన్నా తల్లి ప్రేమను మించిన ప్రేమ ఉండదంటారు. అలా కన్నతల్లి ప్రేమను ఎంత చెప్పినా తక్కువే అన్నట్టు వర్ణిస్తారు. అలాంటి ఓ కన్నతల్లి కనీసం కనికరం లేకుండా కసాయి తల్లిగా మారి నవమాసాలు మోసిన కన్నపేగు బంధాన్ని మానవత్వం మర్చి విక్రయించాలని చూసింది. ఇలాంటి హృదయ విషాదకర సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్ గ్రామ అటవీ ప్రాంతంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… గజ్వేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీ పల్లె పహాడ్ గ్రామానికి చెందిన పోతుల రూప రెండవ కూతురు 20 రోజుల శిశువును అమ్మకానికి బేరం పెట్టింది. గజ్వేల్ మార్కెట్ యార్డులో బేరం కుదుర్చుకొని గుర్తు తెలియని వ్యక్తి ద్విచక్ర వాహనం పై గజ్వేల్- చేగుంట రోడ్డు మార్గంలో ఇందుప్రియాల్ గ్రామం అటవీ ప్రాంతంలోకి వెళ్లి మొత్తం ముగ్గురు పురుషులు, ఒక మహిళ కొనుగోలుదారులు మధ్యవర్తుల మధ్య బేరంలో సఖ్యత కుదరకపోవడంతో వివాదం చెలరేగింది. వారి మధ్య గొడవ జరిగింది. అడవిలో గొర్ల కాపరులు ఆ గొడవను గమనించి సంఘటన స్థలానికి చేరుకొని ఆరా తీయగా ముగ్గురు పురుషులు ఒక మహిళ అక్కడ నుంచి పరారయ్యారు. గొర్రె కాపరులు తల్లి బిడ్డలను రోడ్డుపైకి తీసుకువస్తుండగా వర్షం కురవడంతో గజ్వేల్ వైపు వెళ్తున్న టాటా ఏసీ వాహనాన్ని ఆపారు. వాహనదారులు విషయం తెలుసుకొని 1098 హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన బాల పరిరక్షణ అధికారులు ఇందుప్రియాల్ అంగన్వాడి టీచర్ సుల్తానకు సమాచారం ఇవ్వగా టీచర్ అక్కడికి వెళ్లి తల్లి బిడ్డలను అంగన్వాడీ కేంద్రానికి సురక్షితంగా తీసుకువచ్చింది. బాలల పరిరక్షణ అధికారులు, చైల్డ్ హెల్ప్ లైన్, ఐసిడిఎస్ అధికారులు అంగన్వాడి కేంద్రానికి వచ్చి తల్లి బిడ్డలను సిద్దిపేట శిశు గృహానికి తరలించారు.అనంతరం సిద్దిపేట శిశు గృహ సామాజిక కార్యకర్త రాజారాం మాట్లాడుతూ తల్లి బిడ్డలను సిద్దిపేట శిశు గృహ కు తరలిస్తున్నామని, శిశువు ఆరోగ్య పరిస్థితి పరీక్షించిన తర్వాత పూర్తిస్థాయి విచారణ చేపట్టి శిశువును తల్లి రూపకు అప్పజెప్పడమా లేదా శిశు గృహాలో ఉంచడమా నిర్ణయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చేయండి హెల్ప్ లైన్ అధికారి కవిత, నర్స్ శ్యామల, ఐసిడిఎస్ సూపర్వైజర్ గిరిజ, అంగన్వాడి టీచర్ సుల్తాన,మంజుల,సువర్ణ తదితరులు పాల్గొన్నారు.
