గాలిపటం తీయబోయి బాలుడికి విద్యుత్ షాక్
సిద్దిపేట టైమ్స్, హుస్నాబాద్:
హుస్నాబాద్ పట్టణంలో గాలిపటం తీయబోయిన బాలుడు విద్యుదాఘాతానికి గురైన ఘటన శుక్రవారం జరిగింది. పట్టణంలోని మేడిబావి వీధికి చెందిన కంసాని జ్యోతి కుమారుడు ప్రవీణ్ (12) విద్యుత్ తీగలకు చిక్కుకున్న గాలిపటాన్ని తీసేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలో అకస్మాత్తుగా విద్యుత్ షాక్ తగలడంతో బాలుడు కుప్పకూలాడు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే అతడిని హుస్నాబాద్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి పంపించారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. విద్యుత్ వైర్ల సమీపంలో గాలిపటాలు తీయరాదని, పిల్లలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.




