వాహనం ఒకరి దయితే.. చలాన్ మరొకరికి..
ట్రాఫిక్ పోలీసుల అలసత్వం..
కాల్ చేసి ప్రశ్నించినా పట్టని వైనం..
సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట ప్రతినిధి;
ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహం తారాస్థాయికి చేరిందనే చెప్పాలి. వారి టార్గెట్లను పూర్తి చేసుకోవడం కోసం సామాన్యుల జేబులకు చిల్లు పెడుతున్నారు. వాహనం ఒకరిది అయితే చలాన్ మరొకరికి విధించి వారి వృత్తి ధర్మాన్ని చాటి చెప్పుకుంటున్నారు. వివరాల్లోకెళ్తే..
సిద్దిపేట జిల్లా రాయపోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తెలంగాణ కొత్త సిరీస్ బండి నెంబరు వాహనం(TG)పై వేయాల్సిన జరిమానా మరొక బండి(TS361379)పై వేసిన సంఘటనలో స్థానిక పోలీసుల అలసత్వం బట్టబయలవుతుంది. అమెరికాలో ఉండే ఉషాకిరణ్ రెడ్డి అనే వ్యక్తి సెల్ ఫోన్ కు మీ బైక్ పై జరిమానా పడిందంటూ తెలంగాణ పోలీస్ శాఖ నుండి మెసేజ్ వచ్చింది దీంతో అవాక్కైనా పౌరుడు చెక్ చేసి చూసుకోగా ట్రాఫిక్ ఉల్లంఘనల కింద తన బైక్(TS361379)పై జరిమానా చూపిస్తుంది. ఉషాకిరణ్ వృత్తిరీత్యా అమెరికాలో ఉంటున్నాడు. అతని బండి సిద్దిపేటలోని అతని ఇంట్లో ఉంటుంది. ఆ బండిని ఇతరులు ఎవరు వాడరు అయితే ట్రాఫిక్ చలాన్ వెబ్సైట్లో ఫోటో చెక్ చేయగా అది కొత్తగా వచ్చిన టిజీ(TG) సిరీస్ ఇతరుల బండిగా గుర్తించాడు. దీంతో అది తన బండి కాదని తప్పుడు చలాన్ వేశారని సంబంధిత స్టేషన్ అధికారులకు అధికారిక ఫోన్ నెంబర్ ఆధారంగా కాల్ చేసి అతను రిక్వెస్ట్ చేశాడు. వారి నుండి అతనికి నిర్లక్ష్యంగా వెబ్సైట్లో కంప్లైంట్ చేసుకోమంటూ సమాధానం వచ్చింది వారి సూచన మేరకు ఎన్నిసార్లు వెబ్సైట్లో ఫిర్యాదు చేసినా చాలన్ రద్దు అవడం లేదు. ఇలా పోలీసులు చేసిన నిర్లక్ష్యం వల్ల చాలా మంది పౌరులు ఇబ్బందులకు గురవుతున్నారు.
విధుల పట్ల నిర్లక్ష్యం తగునా..?
ట్రాఫిక్ పోలీసులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఈ విధమైన తప్పుడు చలాన్ల ప్రక్రియ జరుగుతుందని వాహనదారులు వాపోతున్నారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించని వాహనదారులకు విధించవలసిన చలాన్లను రిజిస్ట్రేషన్ నెంబర్ సరిగా చూడకుండా తప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ నమోదు చేసి తప్పుడు చలాన్లను విధిస్తూ సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇప్పటికైనా ట్రాఫిక్ పోలీసులు సరిపడా వివరాలు తెలుసుకుని వాహనదారులకు చలాన్లు విధించాలని, ఈ విధంగా తప్పుడు చలాన్లు ఉన్నచో వాటిని ఆన్ లైన్ లో నుంచి రిమూవ్ చేయాలని వాహనదారులు కోరుతున్నారు.