ఎస్సీ జనరల్‌కు ఖరారైన హుస్నాబాద్ చైర్మన్ పీఠం
హుస్నాబాద్ మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు…
20 వార్డుల భవితవ్యం తేల్చిన ప్రభుత్వం
సిద్దిపేట టైమ్స్, హుస్నాబాద్:
మున్సిపల్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ హుస్నాబాద్ పట్టణంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పట్టణంలోని 20 వార్డులకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రభుత్వం శనివారం తుది రూపంలో ప్రకటించింది. ఈ ఎన్నికల్లో అత్యంత కీలకమైన మున్సిపల్ చైర్మన్ పదవిని ఎస్సీ (జనరల్) కు కేటాయించడంతో ఆయా వర్గాలకు చెందిన ఆశావాహుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది.
వార్డుల వారీగా రిజర్వేషన్ల జాబితా విడుదల కావడంతో ఇప్పటివరకు సందిగ్ధంలో ఉన్న అభ్యర్థులకు స్పష్టత వచ్చింది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు తమ వ్యూహాలను ముమ్మరం చేశాయి.
వార్డుల వారీగా రిజర్వేషన్లు ఇలా:
1, 2, 3, 8, 18, 19వ వార్డులు – జనరల్ మహిళ
4, 5, 20వ వార్డులు – బీసీ జనరల్
6వ వార్డు – ఎస్టీ జనరల్
7, 15వ వార్డులు – బీసీ మహిళ
9, 17వ వార్డులు – ఎస్సీ జనరల్
10, 14వ వార్డులు – ఎస్సీ మహిళ
11, 12, 13, 16వ వార్డులు – జనరల్
మొత్తం 20 వార్డుల్లో మహిళలకు 10 స్థానాలు కేటాయించటం గమనార్హం. ఇందులో జనరల్ మహిళకు 6, ఎస్సీ మహిళకు 2, బీసీ మహిళకు 2 వార్డులు దక్కాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి రిజర్వేషన్లలో మార్పులు రావడంతో పలువురు సిట్టింగ్ కౌన్సిలర్లు కొత్త వార్డులపై దృష్టి సారిస్తున్నారు. చైర్మన్ పీఠం ఎస్సీ జనరల్‌కు దక్కడంతో గెలుపు గుర్రాల ఎంపికలో పార్టీలు నిమగ్నమయ్యాయి. రిజర్వేషన్లు ఖరారుకావడంతో ఇక నుంచి వార్డులవారీగా పర్యటనలు, మంతనాలు, బలాబలాల అంచనాలు మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. హుస్నాబాద్ మున్సిపల్ రాజకీయాలు రానున్న రోజుల్లో మరింత ఉత్కంఠభరితంగా మారనున్నాయని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.



