గాంధీనగర్‌లో సంక్రాంతి సంబరాలు
ముగ్గుల పోటీల్లో అలరించిన చిన్నారులు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:


సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గాంధీనగర్ పాఠశాలలో విద్యార్థులు ముందస్తు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అరుణాదేవి ఆధ్వర్యంలో చిన్నారులకు ముగ్గుల పోటీలు, గాలిపటాలు ఎగురవేసే పోటీలు ఏర్పాటు చేశారు. ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల ముగ్గులతో పాఠశాల ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. విద్యార్థులు గాలిపటాలను ఎగురవేస్తూ సందడి చేశారు. అనంతరం విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. ఈ బహుమతులను జనగామ రవళి (USA) అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పోలు సంపత్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటల్లోనూ రాణించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత కాలంలో పిల్లలు సెల్ ఫోన్లకు దూరంగా ఉండి, ఇలాంటి సంప్రదాయ పోటీల్లో పాల్గొనడం ద్వారా సమయస్ఫూర్తిని పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందించిన దాత రవళికి గ్రామస్తుల తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీశైలం, వార్డు సభ్యులు మేదిని ఆంజనేయులు, గంటల సంపత్, ఉపాధ్యాయ బృందం మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.





