హుస్నాబాద్‌లో ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్
ప్రత్యేక ట్రాఫిక్ పోస్ట్ ప్రారంభం
దిశ, హుస్నాబాద్:
కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయ్‌కుమార్ ఆదేశాల మేరకు హుస్నాబాద్ పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రత్యేక ట్రాఫిక్ పోస్ట్‌ను ప్రారంభించారు. పట్టణంలోని మల్లెచెట్టు చౌరస్తా, అంబేడ్కర్ చౌరస్తా, అక్కన్నపేట రోడ్డుకూడళ్ల వద్ద ప్రతి శుక్రవారం అంగడి, పశువుల మార్కెట్ కారణంగా తరచూ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయని అధికారులు గుర్తించారు.
వాహనాల రాకపోకలు సజావుగా సాగేందుకు, కొత్తగా ఏర్పాటు చేసిన ఈ ట్రాఫిక్ పోస్ట్‌లో ఒక సబ్‌ఇన్‌స్పెక్టర్‌తో పాటు ఏడుగురు సిబ్బందిని నియమించారు. మైనర్ డ్రైవింగ్ లేదా లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసినట్లయితే నేరుగా ఈ-చలాన్ జారీ చేసి, అవసరమైతే వాహనాన్ని తాత్కాలికంగా స్వాధీనం చేసుకుంటారని పోలీసులు హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో నిందితులను తప్పనిసరిగా కోర్టుకు హాజరు పరుస్తామని తెలిపారు.
ప్రజల భద్రత కోసం ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాల్సిందిగా, సహకరించాలని సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్‌కుమార్ పౌరులను కోరారు.



