అభివృద్ధి పేరిట సీఎం సభ ఎన్నికల ప్రచారం కోసమే
బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఐలేని మల్లికార్జున్ రెడ్డి
సిద్దిపేట టైమ్స్. హుస్నాబాద్ :
శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా అభివృద్ధి పేరిట ఈ నెల 3న సీఎం సభ పెట్టడం ఎన్నికల ప్రచారంలో భాగమేనని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఐలేని మల్లికార్జున్ రెడ్డి ఆరోపించారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….డిసెంబర్ 3న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుస్నాబాద్‌లో నిర్వహించనున్న బహిరంగ సభ అభివృద్ధి పేరిట ప్రకటించినప్పటికీ, సర్పంచ్ ఎన్నికల ప్రచారం కోసమే నిర్వహిస్తున్నట్లు కనిపిస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ, ఇప్పటి వరకు హుస్నాబాద్ ప్రాంత అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రాలేదు. గతంలో మంత్రి పొన్నం ప్రభాకర్ నిధులు తెచ్చినట్లు చెబుతున్నప్పటికీ శంకుస్థాపనలు చేసిన పనులను మళ్లీ ప్రకటించి ప్రజలను మభ్యపెట్టడం మోసపూరిత చర్యేనని వ్యాఖ్యానించారు. గౌరవెల్లి ప్రాజెక్టు పనుల్లో 98 శాతం పురోగతి పనులు బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ సమయంలోనే జరిగిందని పేర్కొన్నారు. ప్రాజెక్టు కాలువల కోసం ఇంతకుముందు ప్రకటించిన రూ. 430 కోట్లు తిరిగి మళ్లీ సీఎం సభలో మంజూరు చేస్తామని ప్రకటనలు చేస్తున్నారని, ప్రతి వార్డుకు రూ.50 లక్షల నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామని ప్రకటించినప్పటికీ, కొన్ని వార్డుల్లో పనులు ప్రారంభం కాలేదని తెలియజేశారు.అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఇప్పటికీ పరిహారం అందించకపోవడం, సన్నం వడ్లకు బోనస్ హామీ అమలు కాకపోవడం, శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా ఇప్పుడు అభివృద్ధి పేరిట సభ పెట్టడం ఎన్నికల ప్రచారంలో భాగమేనని ఆరోపించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు సుద్దాల చంద్రయ్య, పట్టణ అధ్యక్షుడు అన్వర్ పాషా, సూరంపల్లి పరశురాం, యాస శ్రీనివాస్, వికాస్ యాదవ్, బొజ్జ హరీష్, మల్కి రెడ్డి మోహన్ రెడ్డి, భూక్యా రాజునాయక్ తదితరులు పాల్గొన్నారు.
Posted inతాజావార్తలు హుస్నాబాద్
అభివృద్ధి పేరిట సీఎం సభ ఎన్నికల ప్రచారం కోసమే



