దేశానికి తెలంగాణ దిక్సూచి కావాలి
సీఎం పర్యటనతో అందరిలో కొత్త ఉత్సాహం రావాలి..మంత్రి పొన్నం ప్రభాకర్
సభకి ఏర్పాట్లు వేగవంతం చేయాలని అధికారులకు దిశా నిర్దేశం
సిద్దిపేట టైమ్స్. హుస్నాబాద్ :
ఎన్నికల్లో గెలిచి 2 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా సీఎం సభను హుస్నాబాద్ లో నిర్వహించడం జరుగుతుందని దీని ద్వారా అందరిలో ఉత్సాహం రావాలని, దేశానికి దిక్సూచిగా తెలంగాణ నిలవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. ఈనెల 3న సీఎం రానున్న సందర్భంగా హుస్నాబాద్ లో నిర్వహించనున్న సభాస్థలిని పర్యవేక్షించారు. సభకు ఏర్పాట్లు వేగవంతం చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ….తెలంగాణ లో అభివృద్ధి చేయడానికి కోర్ అర్బన్ , రీజియన్ ,సెమీ అర్బన్ రీజియన్ ,రూరల్ ఏరియా లుగా విభజించి ప్రత్యేక ప్రణాళికల ద్వారా ఒక విజన్ తో ముందుకు పోతున్నామని అన్నారు. గ్రామాల్లో ఎన్నికల కోడ్ ఉన్న కారణంగా మేము ఏర్పాట్లు చేయడం లేదు కానీ వాళ్ళే వస్తున్నారని వెల్లడించారు.
హుస్నాబాద్ సభలో ముఖ్యమంత్రి విద్యా, వ్యవసాయం ,ఉపాధి కి ప్రాధాన్యత ఇస్తారని, అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారని, సీఎం పర్యటన హుస్నాబాద్ మరింత అభివృద్ధి చెందడానికి తోడ్పడుతుందన్నారు.ఎన్నికల కోడ్ ఇబ్బంది లేకపోతే గౌరవెల్లి భూ నిర్వాసితులకు చెక్కులు పంపిణీ చేస్తామని చెప్పారు. రాహుల్ గాంధీ పై నేషనల్ హెరాల్డ్ కేసులో ఎఫ్ ఐ ఆర్ దాఖలవడం దురదృష్టకరమని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.బీజేపీ అనుబంధ సంఘాలుగా వ్యవహరిస్తున్న ఈడి ఎన్ఫోర్స్మెంట్ వేధింపులకు గురి చేయడంలో దిట్ట అని,బీజేపీ వైఫల్యాలు ముందుకు వచ్చినప్పుడు పార్లమెంట్ సమావేశాల్లో చర్చ జరిగినప్పుడు ప్రతిపక్ష నాయకుడిపై ఇలా ఈడి కేసులతో వేధిస్తుంటారని,
ఇలా వేధించడం వల్ల చర్చ జరగకుండా చూడాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఓట్ల సవరణలు తొలగింపు పై ప్రశ్నిస్తారని ,12 సంవత్సరాల వైఫల్యాల పై ప్రశ్నిస్తారని, పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే హాజరు కాని ప్రధాని పై ప్రశ్నిస్తారని ,రఫెల్ కుంభకోణం , కశ్మీర్ దాడుల నేపధ్యంలో అసమర్థ పాలన ,బీహార్ పేలుళ్లు ,హిందుత్వ ప్రేరేపిత రాజకీయ దాడులపై ధైర్యంగా పార్లమెంట్ లో అధికార పక్షాన్ని రాహుల్ గాంధీ నిలదీయడం వల్లే ఇలా కేసులతో వేధింపులు చేస్తున్నారని అన్నారు.
బీజేపీ తో కలిసి ఉండి ఎంత అవినీతి చేసినా నేతలకు తప్పులేదు. వాళ్ళని ప్రశిస్తే ఇలా కేసులతో వేధిస్తున్నారని,
ప్రజాస్వామాన్ని ,రాజ్యాంగాన్ని కాపాడుతున్న రాహుల్ గాంధీ పై ఈడి వేధింపులు సరైంది కాదని తెలిపారు.మారుతున్న కాలానికి అనుగుణంగా అభివృద్ది చేస్తూ రైజింగ్ తెలంగాణతో అన్ని అంశాలు, ప్రణాళికలతో ముందుకు పోతున్నట్లు పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు 2020 విజన్ తో వెళ్ళారు. కేసీఆర్ చెప్పిన బంగారు తెలంగాణ విజన్ చెప్పిన కవిత అన్నట్టు బంగారు తెలంగాణ వాళ్ళ ఇంటి నుండి బయటకు రాకపోవచ్చు గాని, ఇప్పుడు కాంగ్రెస్ 2047 విజన్ తో ముందుకు పోతున్నామని, దేశానికి తెలంగాణ దిక్సూచి లాగ అభివృద్ధి చెందేలా కార్యాచరణ తీసుకుంటున్నట్లు చెప్పారు.తెలంగాణ ను మూడు భాగాలుగా చేసుకొని అర్బన్, సెమీ అర్బన్, రూరల్ లుగా అభివృద్ధి జరగాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉందని, తెలంగాణ అన్ని రంగాల్లో ముందంజలో ఉండడానికి జరుగుతున్న ప్రయత్నానికి అందరు సహకరించాలని ఈ సందర్భంగా కోరారు.



