“న్యాయవాదులపై దాడులు ఆగాలి”
నిర్మల్ కోర్టు న్యాయవాదిపై దాడి కి నిరసనగా హుస్నాబాద్ కోర్టు ఎదుట న్యాయవాదుల ధర్నా
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
నిర్మల్ కోర్టులో సీనియర్ న్యాయవాది అనిల్ కుమార్‌పై పోలీసులు దాడి చేసిన ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ హుస్నాబాద్ కోర్టు ఎదుట స్థానిక న్యాయవాదులు గురువారం ధర్నా చేపట్టారు. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులు స్వయంగా చట్టాన్ని ఉల్లంఘించడం తీవ్రంగా ఆందోళన కలిగించేదని వారు మండిపడ్డారు. ధర్నాలో పాల్గొన్న న్యాయవాదులు మాట్లాడుతూ— న్యాయవాదులపై దాడులు రోజురోజుకు పెరుగుతుండడం ఆందోళనకరమని, న్యాయవ్యవస్థ ప్రతిష్టను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలకు న్యాయం అందించడానికి ముందుండే న్యాయవాదుల భద్రతపై ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వక్తలు అభిప్రాయపడ్డారు.
ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి న్యాయవాదుల రక్షణ చట్టంను తీసుకురావాలని న్యాయవాద సంఘాలు కోరాయి. న్యాయవాదులపై దాడులను అరికట్టడానికి ప్రత్యేక చట్టం అవసరమని, ఇలాంటి దాడులు పోలీసుల ధైర్యసాహసాలను పెంచి న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని తెలిపారు. తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బార్ అసోసియేషన్‌ల ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని న్యాయవాదులు హెచ్చరించారు.





