తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ కన్నుమూత
సిద్దిపేట టైమ్స్ హైదరాబాద్, నవంబర్ 10:
తెలంగాణ రాష్ట్ర గీతం “జయ జయ హే తెలంగాణ, జయ హో మహా తెలంగాణ” సృష్టికర్త, ప్రముఖ కవి అందెశ్రీ (64) ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్లోని లాలాగూడలోని తన నివాసంలో స్పృహ తప్పి కుప్పకూలడంతో కుటుంబ సభ్యులు తక్షణమే గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు పరీక్షించి ఆయన ఇప్పటికే గుండెపోటుతో మరణించినట్లు ధృవీకరించారు. గత నాలుగు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. రాష్ట్ర గీత రచయితగా అందెశ్రీ పేరు ప్రతి తెలంగాణవాడి మనసులో నిలిచిపోయింది. ఆయన రచించిన “జయ జయ హే తెలంగాణ” గీతం, తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తూ రాష్ట్ర ఉద్యమ సమయంలో ప్రజల్లో విశేష స్పూర్తి నింపింది. రాష్ట్ర ఏర్పాటుతో ఈ గీతం అధికారిక రాష్ట్ర గీతంగా ప్రకటించబడింది.
తెలంగాణ సాహిత్య రంగానికి అపారమైన సేవలందించిన అందెశ్రీ (అసలు పేరు అందె ఎల్లయ్య) వరంగల్ జిల్లా, జనగాం సమీపంలోని రేబర్తి గ్రామం (మద్దూర్ మండలం) లో జన్మించారు. చిన్ననాటి నుండి అనాథగా పెరిగిన ఆయనకు సాంప్రదాయ విద్యా వ్యవస్థలో చదువుకునే అవకాశం లేకపోయినా, తన ప్రతిభతో రాష్ట్రం గుర్తించిన గొప్ప కవి, గేయరచయితగా ఎదిగారు.అందెశ్రీ జీవితం అద్భుతమైన ప్రేరణాత్మక గాథ. ఒకప్పుడు గొడ్ల కాపరిగా పనిచేసిన ఆయన గాన ప్రతిభను గుర్తించిన శృంగేరి మఠ స్వామీ శంకర్ మహారాజ్ ఆశ్రయించారు. అప్పటి నుండి ఆయన రచనా ప్రస్థానం ప్రారంభమైంది. తెలంగాణ భూమి, ప్రజలు, సంస్కృతి, ప్రకృతి వంటి అంశాలను తన గేయాల ద్వారా అందెశ్రీ అమరులుగా మార్చారు.
నారాయణ మూర్తి దర్శకత్వంలో వచ్చిన విప్లవాత్మక చిత్రాలకు ఆయన రాసిన పాటలు విశేష ప్రజాదరణ పొందాయి. 2006లో “గంగ” సినిమాకు గానూ నంది పురస్కారం అందుకున్నారు. అలాగే “బతుకమ్మ” సినిమాకి సాహిత్యం కూడా అందించారు. తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ పాటలు ఉద్యమ కారుల్లో స్పూర్తి నింపాయి. ఆయన రచించిన “జయ జయ హే తెలంగాణ” గీతం రాష్ట్ర ఆవిర్భావ సమయంలో తెలంగాణ గర్వకారణమైంది. ఆయనకు 2025 జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా రూ. 1 కోటి నగదు పురస్కారం అందజేయబడింది. అందెశ్రీ మరణం పట్ల సాహిత్య, సినీ, సాంస్కృతిక వర్గాలతో పాటు రాష్ట్ర ప్రజలు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.





