మొంథా తుఫాన్ నష్టాలపై క్షేత్రస్థాయి పరిశీలనకు ఆదేశాలు
నష్టపోయిన ప్రతి రైతుకూ సహాయం అందించాలి : మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట టైమ్స్ వెబ్ డెస్క్:
మొంథా తుఫాన్ వల్ల రైతులు, ప్రజలు ఎదుర్కొన్న నష్టాలను ఖచ్చితంగా అంచనా వేసి, ఒక్కరికీ కూడా అన్యాయం జరగకుండా చూడాలని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. మంత్రి సూచనల మేరకు వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయిలో రైతుల పొలాలను సందర్శించి పక్కా నష్టం నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. నష్టపోయిన ప్రతి రైతు వివరాలు సేకరించి, నిర్దిష్ట నమూనా ప్రకారం నివేదికలు సమర్పించాలన్నారు.
తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రోడ్లు ఎంత మేరకు నష్టపోయాయో పరిశీలించి, తాత్కాలిక మరియు శాశ్వత మరమ్మత్తులకు అవసరమైన వ్యయ అంచనాలు సహా నివేదికలు సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. విద్యుత్ శాఖ పరిధిలో దెబ్బతిన్న పోల్స్, ట్రాన్స్ఫార్మర్లు వివరాలను వెంటనే సమర్పించాలన్నారు. అలాగే నీటి పారుదల శాఖ పరిధిలో చెరువులు, కాల్వలు, నీటివనరులు ఎటువంటి నష్టాన్ని ఎదుర్కొన్నాయో వివరాలు సేకరించాలని ఆదేశించారు.
ఇతర విభాగాలు కూడా దెబ్బతిన్న ఇండ్లు, చనిపోయిన పశువులు, గొర్రెలు, పౌల్ట్రీ పక్షులు తదితర వివరాలను సమగ్రంగా నివేదించాలని మంత్రి తెలిపారు. నష్టపోయిన ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అవసరమైన సహాయ చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. “ప్రతి బాధితుడి వద్దకు ప్రభుత్వం సహాయం చేరేలా అధికారులు కృషి చేయాలి. ప్రజల నష్టాన్ని పూడ్చడం ప్రభుత్వ బాధ్యత” అని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.





