అనభేరి ప్రభాకర్ రావు విగ్రహాన్ని బస్ డిపో క్రాస్ రోడ్డులోనే పునప్రతిష్ఠించాలి
హుస్నాబాద్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించిన సిపిఐ నేత చాడ
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
హుస్నాబాద్ పట్టణంలోని ఆర్టీసీ బస్ డిపో క్రాస్ రోడ్డులో ఉన్న తెలంగాణ సాయుధ పోరాట యోధుడు అనభేరి ప్రభాకర్ రావు విగ్రహాన్ని అదే ప్రదేశంలో తిరిగి పునప్రతిష్ఠించాలని సిపిఐ జాతీయ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం హుస్నాబాద్ పురపాలక సంఘ కమిషనర్ తాటి మల్లికార్జున్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ, మహ్మదపూర్ గ్రామానికి చెందిన అమరజీవి అనభేరి ప్రభాకర్ రావు నిజాం పాలనలో రజాకారుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడి ప్రజలకు విముక్తి కలిగించిన సాయుధ పోరాట యోధుడని గుర్తు చేశారు. 2012లో తన ఆధ్వర్యంలో, అప్పుడు ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, ప్రస్తుత మంత్రి పోన్నం ప్రభాకర్ (అప్పుడు కరీంనగర్ ఎంపీ) సమక్షంలో విగ్రహం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అమరజీవి విగ్రహాన్ని బస్ డిపో క్రాస్ రోడ్డులోనే పునప్రతిష్ఠించి ఆయన త్యాగాలకు గౌరవం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కన్వీనర్ జాగీర్ సత్యనారాయణ, జిల్లా సహాయ కార్యదర్శి గడిపె మల్లేశ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు అయిలేని సంజీవరెడ్డి, మండల సహాయ కార్యదర్శి పోదిల కుమారస్వామి, నాయకులు బత్తుల బాబు, అయిలేని మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.





