హుస్నాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం – వ్యక్తి మృతి
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్, నవంబర్ 4 (ప్రతినిధి)
హుస్నాబాద్ పట్టణంలో ఈరోజు ఉదయం జరిగిన దుర్ఘటనలో వ్యక్తి దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళ్తే, పట్టణంలోని 10వ వార్డ్ జ్యోతినగర్‌కు చెందిన పోగుల యాదగిరి (వయసు 50 సంవత్సరాలు పైబడి) ప్రతిరోజు మాదిరిగానే తన ఇంటి నుండి హోటల్కు వెళ్తుండగా ఈరోజు ఉదయం సుమారు 7 గంటల సమయంలో ప్రభుత్వ దవాఖాన ఎదుట వెనుక నుండి బొలెరో వ్యాన్ (TG08V1925) అతివేగంగా వచ్చి ఆయన సైకిల్‌ను ఢీకొట్టి సుమారు 30 అడుగుల దూరం వరకు ఈడ్చి కెళ్ళింది. దీంతో యాదగిరి తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన చికిత్స కోసం ఎంజీఎం ఆసుపత్రికి తరలించే మార్గంలోనే ఆయన మృతి చెందారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేశారు. యాదగిరి మరణంతో జ్యోతినగర్ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది.







