అక్కన్నపేట లో గల్లంతైన దంపతుల గాలింపు చర్యలు ముమ్మరం
ఘటనా స్థలాన్ని సందర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్, పోలీస్ కమిషనర్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలం మోత్కులపల్లి గ్రామం వద్ద వాగు దాటుతుండగా బైక్పై వెళ్తున్న భార్యాభర్తలు ప్రణయ్, కల్పన గల్లంతైన ఘటనపై గాలింపు చర్యలు ముమ్మరం అయ్యాయి. ఈ ఘటన జరిగిన 24 గంటలు గడిచినా వారి ఆచూకీ లభించకపోవడంతో ప్రభుత్వం యంత్రాంగం సమన్వయంతో విస్తృత స్థాయిలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది.

మంత్రి పొన్నం ప్రభాకర్ ఘటన స్థలాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులతో సమీక్షించారు. గల్లంతైన దంపతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. “ప్రభుత్వం ఈ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటుంది” అని హామీ ఇచ్చారు. గాలింపు చర్యలను వేగవంతం చేయాలని సూచిస్తూ, చీఫ్ సెక్రటరీ రామకృష్ణతో కూడా మంత్రి ఫోన్లో మాట్లాడి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను వెంటనే రంగంలోకి దింపాలని ఆదేశించారు. రాత్రి వరకు ఫైర్ సర్వీస్ సిబ్బంది, గజ ఈతగాళ్లు శ్రమించినప్పటికీ ఫలితం దక్కలేదు. దీంతో రాత్రి వేళల్లోనే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఘటన స్థలానికి చేరుకుని మల్లంపల్లి చెరువు వరకు విస్తృత గాలింపు చర్యలకు సిద్ధమయ్యాయి. రేపు ఉదయం నుంచి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సంయుక్తంగా గాలింపు చర్యలను ముమ్మరం చేయనున్నట్లు సమాచారం.

జిల్లా కలెక్టర్ కే. హేమావతి గురువారం అక్కన్నపేట మండలంలో పర్యటించి మోత్కులపల్లి వాగు ప్రాంతాన్ని పరిశీలించారు. గల్లంతైన దంపతుల ద్విచక్రవాహనం చిక్కుకున్న ప్రదేశాన్ని పరిశీలించి, “మల్లంపల్లి చెరువులో కూడా గాలింపు చర్యలు చేపడతాం” అని తెలిపారు. హుస్నాబాద్ ఆర్డీవో రామ్మూర్తికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు.
ఇక పోలీస్ కమిషనర్ ఎస్.ఎం. విజయ్ కుమార్ కూడా ఘటన స్థలాన్ని సందర్శించి రెస్క్యూ బృందాలకు సూచనలు జారీ చేశారు. అనంతరం ఆయన హుస్నాబాద్ మార్కెట్ యార్డును కూడా పరిశీలించారు. భారీ వర్షాలతో వరద నీటిలో మునిగిన వరి ధాన్యం పరిస్థితిని సమీక్షించి, తగు చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్, పోలీస్ క్వార్టర్స్ ప్రాంతాలను పరిశీలించిన కమిషనర్, తుఫాన్ కారణంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రేపు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హుస్నాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నందున అన్ని శాఖల అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ ఆదేశించారు.






