హుస్నాబాద్ మార్కెట్ యార్డులో నీట మునిగిన వరి ధాన్యాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్
వర్షానికి గోదాం గోడ కూలి మార్కెట్లోకి నీరు… సుమారు 1500 క్వింటాళ్ల వరి నష్టం
తడిసిన, మొలకెత్తిన ధాన్యం వివరాలు వెంటనే నమోదు చేయాలి
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రైతులకు సాయం

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
“మొంథా” తుపాన్ ప్రభావంతో హుస్నాబాద్ ప్రాంతంలో బుధవారం రోజంతా ఎడతెరిపి లేకుండా కురిసిన సుమారు 30 సెంటీమీటర్ల భారీ వర్షం కారణంగా వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో భారీగా వరి ధాన్యం నష్టపోయింది. నీటిలో కొట్టుకుపోయిన, పూర్తిగా నానిన ధాన్యం పరిస్థితిని గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ కె. హైమావతి హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డును పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… “నిన్నటి కుండపోత వర్షం కారణంగా మార్కెట్ యార్డు వెనుక ప్రహరీ గోడ కింద భాగంలో నీరు బయటకు వెళ్లే మార్గం వద్ద పోతారం నుంచి సుమారు 3 కిలోమీటర్ల పరిధిలోని నీరు గోదాం లోపలికి చేరింది. దీంతో గోదాం లో ఉన్న వరి ధాన్యం పూర్తిగా నానిపోవడం, కొట్టుకుపోవడం జరిగింది” అని తెలిపారు. “సమాచారం తెలిసిన వెంటనే ఆర్డీవో రామ్మూర్తి, మార్కెటింగ్ అధికారులు అప్రమత్తమై గోదాం వెనుక ప్రహరీ గోడలో రెండు మీటర్ల పొడవున తొలగించి నీటి ప్రవాహాన్ని బయటకు తరలించారు. సుమారు 1500 క్వింటాళ్ల వరి ధాన్యం కొట్టుకుపోయినట్లు ప్రాథమిక అంచనా. అధికారులు తడిసిన, మొలకెత్తిన, కొట్టుకుపోయిన ధాన్యం వివరాలు నమోదు చేసి, ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు. ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటాం” అని అన్నారు.
“నానిన ధాన్యాన్ని తేమ తగ్గిన వెంటనే ఆరబోసి గన్నిలలో నింపితే మరింత నష్టం జరగదు. వాతావరణ శాఖ ముందుగానే ‘మొంథా’ తుపాన్ హెచ్చరికలు ఇచ్చింది. కాబట్టి రైతులు వరి కోత తర్వాత వెంటనే మార్కెట్ యార్డుకు తీసుకురాకుండా, ముందుగా క్షేత్ర స్థాయిలో ఆరబోసి తేమశాతం తగ్గిన తర్వాత మాత్రమే గోదాంలకు తరలించాలి” అని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు ఆర్డీవో రామ్మూర్తి, డీఎం మార్కెటింగ్ నాగరాజు, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మార్కెటింగ్ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.






