రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో బంగారు పతకం సాధించిన హుస్నాబాద్ విద్యార్థి
విద్యార్థిని అభినందించిన జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు గర్వకారణంగా నిలిచే విజయాన్ని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలుర) విద్యార్థి నూనె దివాకర్ సాధించాడు. ఈ నెల 16 నుండి 18 వరకు పటాన్చెరువు మైత్రి గార్డెన్స్‌లో జరిగిన 69వ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కబడ్డీ పోటీల్లో పాల్గొని, ఉమ్మడి మెదక్ జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన దివాకర్, అద్భుత ప్రతిభ కనబర్చి బంగారు పతకం సాధించాడు. ఈ సందర్భంగా పిడి ఆర్ శ్రీనివాస్ విద్యార్థి విజయాన్ని ప్రకటించి ఆనందం వ్యక్తం చేశారు. దివాకర్ ఘనవిజయాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేడం లింగమూర్తి, ప్రధానోపాధ్యాయుడు కే. వాసుదేవ రెడ్డి, సీనియర్ క్రీడాకారుడు ఎం.డి. హసన్ కలిసి విద్యార్థిని శాలువాతో సన్మానించారు. కేడం లింగమూర్తి మాట్లాడుతూ, “దివాకర్ క్రమశిక్షణతో శిక్షణ పొంది రాష్ట్రస్థాయిలో ప్రతిభ చూపడం ప్రశంసనీయం. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ మెరుగైన ప్రదర్శన చేసి హుస్నాబాద్‌కు, సిద్దిపేట జిల్లాకు, తెలంగాణ రాష్ట్రానికి పేరు తేవాలని ఆశిస్తున్నాం” అన్నారు. క్రీడాకారునికి శిక్షణ అందించిన పిడి ఆర్ శ్రీనివాస్, కోచ్ కృష్ణ ను కూడా లింగమూర్తి అభినందించారు. ఈ కార్యక్రమంలో హెచ్.ఎం. వాసుదేవ రెడ్డి, సీనియర్ క్రీడాకారులు ఎం.డి. హసన్, గంపల శ్రీనివాస్, బత్తుల రావి, నోముల బాలయ్య, అనిల్, పంజా రాజమల్లు, వెంకట మల్లు, భాస్కరాచారి తదితరులు పాల్గొన్నారు.





