“ ధాన్యం రోడ్లపై పోసి ఒకరి మరణానికి మనం కారణం కారాదు”
ప్రతి ఒక్కరూ రోడ్డు, ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలి
హుస్నాబాద్ ఏసీపి సదానందం
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
రోడ్లపై ధాన్యం ఆరబెట్టడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో హుస్నాబాద్ ఏసీపీ సదానందం రైతులకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. “ధాన్యం రోడ్లపై పోసి ఒకరి మరణానికి మనం కారణం కారాదు” అని అన్నారు. రాత్రి వేళల్లో వాహనదారులు స్పష్టంగా చూడలేక ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. జిల్లాలో ఇప్పటికే మూడు నుంచి నాలుగు ఇటువంటి సంఘటనలు నమోదయ్యాయని తెలిపారు. రోడ్డు మీద ధాన్యం పోసి ప్రమాదం జరిగితే, ఆ రైతుపైనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏసీపీ సదానందం హెచ్చరించారు. “ఒకరి నిర్లక్ష్యం మరొకరి ప్రాణాన్ని బలి తీసుకోకూడదు. ప్రజల ప్రాణం అన్నది అత్యంత విలువైనది” అని పేర్కొన్నారు. రైతులు రోడ్లకు అడ్డంగా కాకుండా పక్కన ఉన్న సురక్షిత ప్రదేశాల్లోనే ధాన్యం, మక్కలను ఆరబెట్టాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నియమాలు పాటిస్తేనే ప్రమాదాలు తగ్గుతాయని, ప్రజలు బాధ్యతతో వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు.





