తడిసిన వడ్లను ఎలాంటి ఆంక్షలు లేకుండా కోనుగోలు చేయాలి
మార్కెట్ కు శాశ్వత కార్యదర్శిని నియమించాలి
బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్, అక్టోబర్ 25:

హుస్నాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో తడిసిన వడ్ల కొనుగోలు ప్రక్రియలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలని బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు డిమాండ్ చేశారు. శనివారం ఆయన బీజేపీ నాయకులతో కలిసి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, తడిసిన వడ్లను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని, మార్కెట్ సూపర్వైజర్ గంగారాం కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బత్తుల శంకర్ బాబు మాట్లాడుతూ…, అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, అధికారులు తేమశాతం పేరుతో రైతుల పంట కొనుగోలు చేయకుండా ఆలస్యం చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. గత 10-15 రోజులుగా రైతులు మార్కెట్ యార్డులో పడిగాపులు కాస్తున్నారని, తేమశాతం అనే పేరుతో పంటలను అంగీకరించకపోవడం రైతుల జీవితాలను కష్టాల్లోకి నెడుతోందని అన్నారు. సన్న వడ్లు పండిస్తే బోనస్ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా, సారవ్వ అనే మహిళా రైతు 15 రోజులుగా మార్కెట్లో వేచి ఉన్నా, అధికారులు 650 బస్తాలు అయితేనే కొనుగోలు చేస్తామని చెప్పడం దారుణమన్నారు. తడిసిన వడ్లు పరిశీలనలో అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్ల రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని చెప్పారు.
మార్కెట్ కమిటీకి శాశ్వత కార్యదర్శి లేకపోవడం వల్ల రైతుల సమస్యలను పరిష్కరించే దిక్కు లేకుండా పోయిందని, వెంటనే శాశ్వత కార్యదర్శిని నియమించాలని, రైతుల సంఖ్య పెరిగిన దృష్ట్యా మార్కెట్ సామర్థ్యాన్ని విస్తరించాలని డిమాండ్ చేశారు. తడిసిన వడ్లను ఎలాంటి ఆంక్షలు లేకుండా తక్షణం కొనుగోలు చేయాలని, లేదంటే బీజేపీ రైతుల పక్షాన బహిరంగ పోరాటం చేపడతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు వేముల దేవేందర్ రెడ్డి, తోట సమ్మయ్య, వరియోగుల అనంతస్వామి, వేల్పుల నాగార్జున్, బోడిగే వెంకటేష్, పోలోజు రాజేందర్ చారీ, నారోజు నరేష్, బోనగిరి రాజేష్, వేముల రమణ తదితరులు పాల్గొన్నారు.





