అరుణాచల గిరి ప్రదక్షిణ భక్తులకు శుభవార్త
హుస్నాబాద్ డిపో నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్, అక్టోబర్ 24 (ప్రతినిధి):
తమిళనాడులోని పవిత్ర క్షేత్రమైన అరుణాచలం గిరి ప్రదక్షిణకు వెళ్ళాలనుకునే భక్తులకు శుభవార్త. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం హుస్నాబాద్ డిపో ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును నడపాలని నిర్ణయించింది. హుస్నాబాద్ డిపో మేనేజర్ వెల్లడించిన వివరాల ప్రకారం — ఈ బస్సు నవంబర్ 3వ తేదీ సాయంత్రం హుస్నాబాద్ బస్టాండ్ నుండి బయలుదేరి, హైదరాబాద్ మీదుగా అరుణాచలం వైపు ప్రయాణం ప్రారంభిస్తుంది. ప్రయాణంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని కాణిపాక విఘ్నేశ్వరుని ఆలయం, గోల్డెన్ టెంపుల్ దర్శనాలు కూడా ఉంటాయి. యాత్రికులు నవంబర్ 4 రాత్రి అరుణాచలం చేరుకొని నవంబర్ 5న కార్తీక పౌర్ణమి సందర్భంగా అరుణాచలేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ పూర్తి చేస్తారు. అనంతరం బస్సు నవంబర్ 5 సాయంత్రం తిరుగు ప్రయాణం ప్రారంభించి, నవంబర్ 6 ఉదయం ఆలంపూర్ జోగులాంబ అమ్మవారి శక్తిపీఠాన్ని దర్శించి అదే రోజు సాయంత్రం హుస్నాబాద్‌కు చేరుకుంటుంది.
ఈ యాత్రను TGS RTC టూర్ ప్యాకేజీగా అందిస్తోంది. ప్యాకేజీ ధర పెద్దలకు రూ.4500, పిల్లలకు రూ.3400గా నిర్ణయించారు. ఈ మొత్తంలో అన్ని సెస్ చార్జీలు, టోలు టాక్సులు, బోర్డర్ టాక్సులు మరియు నాలుగు దేవస్థాన దర్శనాలు చేర్చబడ్డాయి. భక్తులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని డిపో అధికారులు సూచించారు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తమ సమీప RTC రిజర్వేషన్ కౌంటర్ లేదా హుస్నాబాద్ బస్టాండ్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం 73828 49613, 73828 47741, 99592 25930 నంబర్లను సంప్రదించాలని అధికారులు తెలిపారు.





