వేగంగా హుస్నాబాద్‌లో 250 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం
రూ.82 కోట్ల తో 38 మంది వైద్యులతో ఆధునిక హాస్పటల్
నర్సింగ్ కాలేజీతో పాటు హుస్నాబాద్‌ను వైద్య రంగంలో ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతా
ఆధునిక ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట టైమ్స్, హుస్నాబాద్:

హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మాణంలో ఉన్న 250 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవన పనులను పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించిన మంత్రి, అధికారులు, కాంట్రాక్టర్లతో చర్చించి అవసరమైన సూచనలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ…. “సుమారు రూ.82 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునిక సదుపాయాలతో కూడిన 250 పడకల ఆసుపత్రి నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. ఈ ఆసుపత్రి పూర్తి అయిన తర్వాత హుస్నాబాద్ ప్రజలకు జిల్లా కేంద్రం స్థాయి వైద్య సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి” అని తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఎనిమిది మంది వైద్యులు సేవలందిస్తున్నారని, నూతన భవనం పూర్తి కాగానే మొత్తం 38 మంది వైద్యులు నియమించబడి, వైద్య విభాగాలు విస్తరించనున్నాయని పేర్కొన్నారు. అలాగే హుస్నాబాద్‌లో నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేయడానికి చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో నెంబర్ వన్ ప్రభుత్వ ఆసుపత్రిగా హుస్నాబాద్ ఆసుపత్రిని తీర్చిదిద్దే దిశగా కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు.
ఇక టూరిజం అభివృద్ధి కోసం మహాసముద్రం గండి వద్ద పనులు కొనసాగుతున్నాయని, గౌరవెల్లి కాలువల పనుల కోసం భూసేకరణ జరుగుతోందని, రైతులు అందరూ సహకరించాలని మంత్రి కోరారు. ఆరోగ్యం, వైద్యం, వ్యవసాయం, ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి తదితర రంగాలలో హుస్నాబాద్ అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి తెలిపారు. అంతేకాక, పొన్నం సత్తయ్య ట్రస్టు ఆధ్వర్యంలో క్యాన్సర్ నివారణ అవగాహన కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాలకు 13 రకాల వస్తువులతో కూడిన స్టీల్ పాత్రలను పంపిణీ చేసినట్లు మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, ఆర్డిఓ రామ్మూర్తి, ప్రభుత్వ హాస్పిటల్ సూపర్ ఇండెంట్ డాక్టర్ రమేష్, హాస్పిటల్ సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఇతర అధికారులు పాల్గొన్నారు.





