తెలంగాణ బంద్..అన్ని పార్టీల మద్దతు…ఇది ఎవరిపై పోరాటం?
మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిన రాష్ట్ర వ్యాప్త ఆందోళన
సిద్దిపేట టైమ్స్ వెబ్ డెస్క్:
తెలంగాణ రాష్ట్రం లో ఈరోజు BC సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన బంద్ 42% శాతం రిజర్వేషన్ల సాధన కోసం జరుగుతోంది. కానీ ఈ బంద్ ఎవరిపై పోరాటమో అన్న ప్రశ్న ఇప్పుడు ప్రజల్లో పెద్ద చర్చకు దారితీసింది. BC రిజర్వేషన్ల పెంపు కోసం బీసీ సంఘాలు గత కొంతకాలంగా నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో “ సమాన హక్కుల కోసం” రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చాయి. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే బంద్కు కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతిపక్ష BRS, BJP పార్టీలు సహా అన్ని ప్రధాన రాజకీయ శక్తులు మద్దతు ప్రకటించాయి. ఇలా అన్ని పార్టీలు బంద్కు మద్దతు ఇస్తే మరి ఈ బంద్ తో ఎవరిపై పోరాటం చేస్తున్నట్లు?… కేంద్ర ప్రభుత్వం పైనా? … లేక రాష్ట్ర ప్రభుత్వం పైనా? అనే ప్రశ్న ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.
ప్రజా సంఘాలు మాత్రం “ఇది ఎవరిపై పోరాటం కాదు, మా హక్కుల కోసం ఉద్యమం”. కానీ రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ బంద్ వెనుక రాజకీయ వ్యూహాలున్నాయని సూచిస్తున్నారు. ఒకవైపు BC వర్గాల ఆవేదనను ప్రతీ పార్టీ వినియోగించుకోవాలని చూస్తుంటే, మరోవైపు ప్రభుత్వం మాత్రం రాజ్యాంగపరమైన అడ్డంకులను చూపిస్తూ తటస్థంగా వ్యవహరిస్తోంది. బంద్ ప్రభావం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో స్పష్టంగా కనిపించింది. RTC బస్సులు నిలిపివేయబడ్డాయి, విద్యాసంస్థలు మూతపడ్డాయి, వ్యాపార కేంద్రాలు మూసివేశారు. ఈ బంద్ తర్వాత ప్రధాన ప్రశ్న మాత్రం జవాబు లేకుండా మిగిలిపోయింది అది “నేటి ఈ బంద్ ఎవరిపై పోరాటం?” ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వాతావరణం ఈ ప్రశ్న చుట్టూ తిరుగుతోంది.





