ప్రజాస్వామ్యానికి కొత్త ఊపిరి – ఓటు అమ్ముకోకూడదని యువత తీర్మానం
డబ్బు, మద్యం లేని స్వచ్ఛమైన ఎన్నికలకై గాంధీనగర్ గ్రామ యువత తీర్మానం
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పలు గ్రామాలలోని యువత ఆదర్శవంతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గాంధీనగర్ లో గ్రామ అభివృద్ధి కమిటీ, యువత సమావేశమై రానున్న ఎన్నికల్లో డబ్బు, మద్యం తీసుకోకుండా రాజ్యాంగబద్ధంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఓటు హక్కు ఎంత విలువైనదో చెప్పే విధంగా గ్రామానికి చెందిన మేధావులు, గ్రామ పెద్దలు, యువత సమావేశమై ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తి డబ్బు పంచకుండా, ఓటరు కూడా డబ్బు, మద్యానికి తన ఓటును అమ్ముకోకుండా తీర్మానం చేశామని గ్రామ యువకులు తెలిపారు. ఒక వ్యక్తి ఓటు హక్కు ఎంతో విలువైనదని, ఆ ఓటు హక్కును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా ఓటు వెయ్యాలనేదే తమ లక్ష్యమన్నారు. రాజకీయ నాయకులు ఎన్నికలు రాగానే ఓట్ల కోసం డబ్బులు, మద్యం పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తురన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ గ్రామంలో డబ్బు, మద్యం తీసుకోకుండా, పంచకుండా, తీర్మానం చేశామని, రాష్ట్రంలోని మిగతా గ్రామాలు కూడా ఈ విధంగా ఆలోచించాలని కోరారు.





