రైతు బజార్‌లో తక్షణం కొనుగోళ్లు ప్రారంభించాలి
బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు సూద్దాల చంద్రయ్య, అయిలేని మల్లికార్జున రెడ్డి
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్,
హుస్నాబాద్ పట్టణంలోని శివాజీ నగర్‌లో నిర్మించిన రైతు బజార్‌ను బీఆర్‌ఎస్ పార్టీ అధికార ప్రతినిధులు సూద్దాల చంద్రయ్య, అయిలేని మల్లికార్జున రెడ్డి ఆదివారం సందర్శించారు. నెలల క్రితం ప్రారంభించినా ఇప్పటికీ అక్కడ కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంపై వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రైతు బజార్ నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.3 కోట్ల నిధులు మంజూరు చేయగా, పనులు పూర్తయి దాదాపు ఎనిమిది నెలల క్రితం ప్రారంభోత్సవం జరిగినప్పటికీ, ఇప్పటివరకు వ్యాపారం ప్రారంభం కాలేదని వారు గుర్తు చేశారు. “ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని రైతు బజార్‌ను ప్రజల వినియోగానికి అందుబాటులోకి తేవాలి” అని అయిలేని మల్లికార్జున రెడ్డి తెలిపారు.
రైతు బజార్ లేనందున కూరగాయల వ్యాపారులు బహిరంగ రహదారుల పక్కన వ్యాపారం చేస్తుండటంతో ప్రజలు రవాణా, రద్దీ మరియు శుభ్రత సమస్యలను ఎదుర్కొంటున్నారని నాయకులు తెలిపారు. వెంటనే రైతు బజార్‌లో కొనుగోళ్లు ప్రారంభించి వ్యాపారులు, వినియోగదారులకు సౌకర్యం కల్పించాలనీ వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఇంద్రాల సారయ్య, పార్టీ నాయకులు పాకాల శ్యామ్ సుందర్ గౌడ్, మల్కి మోహన్ రెడ్డి, మేకల వికాస్ యాదవ్, బూర వెంకన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు.





