హుస్నాబాద్‌లో నార్కోటిక్ డాగ్స్‌తో ప్రత్యేక తనిఖీలు
మత్తు పదార్థాల నిల్వ, విక్రయాలపై కఠిన చర్యలు – ఎస్ఐ లక్ష్మారెడ్డి


హుస్నాబాద్, అక్టోబర్ 11:
హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల వ్యాప్తిని అరికట్టేందుకు నార్కోటిక్ డాగ్స్ సహాయంతో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. అక్కన్నపేట రోడ్, గాంధీ రోడ్, కరీంనగర్ రోడ్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్ సహా పట్టణంలోని దాబాలు, టీ కొట్టులు, కిరాణా షాపులు, మరియు అనుమానాస్పద ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు.
ఈ సందర్భంగా హుస్నాబాద్ ఎస్ఐ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, పోలీస్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు పట్టణంలో డ్రగ్స్, గంజాయి, మరియు మత్తు పదార్థాలు కలిపిన చాక్లెట్లు, పాన్ షాపుల్లో లేదా ఇతర ప్రదేశాల్లో విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అక్రమంగా రవాణా చేసినా లేదా నిల్వ ఉంచినా చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అలాగే ప్రజలు కూడా ఈ యుద్ధంలో భాగస్వాములు కావాలని, గ్రామాల్లో యువకుల ప్రవర్తనలో మార్పులు గమనిస్తే వెంటనే పోలీసులకు లేదా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో టోల్ ఫ్రీ నంబర్ 1908 కు లేదా డయల్ 100 ద్వారా సమాచారం అందించాలని కోరారు. యువత తాత్కాలిక ఆనందం కోసం జీవితాలను నాశనం చేసుకోవద్దని, గంజాయి రహిత జిల్లా లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్ఐ లక్ష్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డాగ్ స్క్వాడ్ సిబ్బంది అజయ్‌కుమార్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





