హుస్నాబాద్ మండలంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మిక పర్యటన
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
హుస్నాబాద్ మండలంలో పలు ప్రభుత్వ సంస్థలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, బస్తీ దవాఖానలను జిల్లా కలెక్టర్ కె. హైమావతి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు అందించే సేవల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.
మొదటగా కలెక్టర్ పందిళ్ల ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. విద్యార్థులకు కేవలం టమాటా పప్పు, పచ్చి పులుసు, గుడ్డు మాత్రమే వండారని గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు పచ్చి పులుసు పెట్టడం అనారోగ్యానికి దారితీస్తుందని హెచ్చరించి, కామన్ డైట్ మెనూ పాటించకపోవడంపై ప్రిన్సిపల్‌పై తీవ్రంగా మండిపడ్డారు. డీఈఓకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పిల్లలకు పౌష్టికాహారం అందించడమే పథకం ఉద్దేశమని ఆమె తెలిపారు. తరువాత కలెక్టర్ పందిళ్ల అంగన్వాడీ సెంటర్ను సందర్శించి, పిల్లలకు అందించే ఆహారం నాణ్యతను తనిఖీ చేశారు. పిల్లలతో ఆప్యాయంగా మాట్లాడి, స్నాక్స్ రుచి చూశారు. బాలింతలకు అందించే బాలమృతం సరఫరా సక్రమంగా ఉందా అని పరిశీలించారు. చివరగా కలెక్టర్ హుస్నాబాద్ బస్తీ దవాఖానను సందర్శించారు. డాక్టర్ లేక రోగులు ఇబ్బంది పడుతున్నారని సిబ్బంది వివరించగా, త్వరలోనే డాక్టర్ నియమిస్తామని హామీ ఇచ్చారు.
కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ —
“ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలవ్వాలి; బాధ్యతలలో నిర్లక్ష్యం సహించం” అని స్పష్టం చేశారు.






