హుస్నాబాద్ గురుకుల పాఠశాలలో విద్యార్థి అనుమానాస్పద మృతి
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని జిల్లెల గడ్డ గ్రామ శివారులో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతున్న 8వ తరగతి విద్యార్థి సనాదుల వివేక్ (13) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతుడు సిద్దిపేట జిల్లా నంగునూరు గ్రామానికి చెందిన సత్యనారాయణ కుమారుడు. సమాచారం ప్రకారం, నిన్న ఉదయం వివేక్ తండ్రి సత్యనారాయణ తన కుమారుడిని హాస్టల్లో దింపి వెళ్లిపోయాడు. ఈరోజు ఉదయం విద్యార్థి గది లోపల మృతి చెందినట్లు గుర్తించారు. ఈ సంఘటనపై స్కూల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, హుస్నాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరణానికి గల కారణాలు తెలియక పోవడం తో పోలీసులు విచారణ ప్రారంభించారు. వివేక్ మృతి పట్ల తల్లిదండ్రులు, బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు. స్థానికులు ఈ సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.






