కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కన్నుమూత
మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపం
సిద్దిపేట టైమ్స్ డెస్క్:
అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. మాజీ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గ ఇంచార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి (73) గురువారం రాత్రి 10.10 గంటలకు హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.1952 సెప్టెంబర్ 14న ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పాతలింగాల గ్రామంలో జన్మించిన దామోదర్ రెడ్డి, 1985లో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం 1989లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 1994లో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి హ్యాట్రిక్ విజయం సాధించారు. 2004, 2009లో సూర్యాపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన సోదరుడు రాంరెడ్డి వెంకటరెడ్డి పాలేరు నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. రేపు మధ్యాహ్నం సూర్యాపేట రెడ్ హౌస్లో అభిమానుల సందర్శనార్థం దామోదర్ రెడ్డి పార్థీవ దేహాన్ని ఉంచనున్నారు. శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు, బంధువులు, కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. దామోదర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఒక నిబద్ధత గల కార్యకర్తగా ప్రారంభించి, రాష్ట్ర మంత్రిగా ఎదిగిన గొప్ప నాయకుడని గుర్తుచేశారు. ఆయనను అందరూ ప్రేమగా “దామన్న” అని పిలిచేవారని తెలిపారు. ప్రజాసేవలో ఆయన చూపిన తపన చిరస్మరణీయమని, నిజాయితీ గల నాయకుడిగా ఎప్పటికీ గుర్తుండిపోతారని కొనియాడారు. “దామన్న మరణం కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు. ఆయన సేవలు ప్రజల హృదయాలలో ఎప్పటికీ నిలిచిపోతాయి” అని మంత్రి పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.





