హుస్నాబాద్ లో ఘనంగా సద్దుల బతుకమ్మ
ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్, సెప్టెంబర్ 29 :

సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా హుస్నాబాద్ రేణుక ఎల్లమ్మ చెరువు వద్ద ఘనంగా నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. పండుగ సందర్బంగా మహిళలు పూలతో బతుకమ్మను అలంకరించి పాటలు పాడుతూ ఆనందంగా ఆడారు. వారితో కలసి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆత్మీయంగా పలకరిస్తూ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాంప్రదాయాల ప్రకారం బతుకమ్మ పండుగ అందరికీ చల్లదనాన్ని పంచుతుందని, ఈ ఏడాది మంచి వర్షాలు కురవడంతో పంటలు బాగుండి ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నానని అన్నారు. అంతేకాక దసరా పండుగ సందర్భంగా సాయంత్రం రాంలీలా కార్యక్రమం కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాదికి ఎల్లమ్మ చెరువు మరింత అందంగా సుందరీకరించేందుకు పనులు జరుగుతున్నాయని, ప్రజల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు. వేడుకల సందర్భంగా మంత్రి చెరువు వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. చెరువు అలుగు పోసే పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు, మున్సిపల్ సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. స్థానిక నేతలు, అధికారులు చెరువులో స్పీడ్ బోట్లో ప్రయాణం చేస్తూ ఏర్పాట్లను సమీక్షించారు.








