హుస్నాబాద్ లో బతుకమ్మ పండుగకు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు
మల్లెచెట్టు నుండి ఎల్లమ్మ చెరువుకు వాహనాలకు ప్రవేశం లేదు
ప్రజలందరూ సహకరించాలి – హుస్నాబాద్ ఏసీపీ మరియు పురపాలక కమిషనర్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్, సెప్టెంబర్ 29 (సోమవారం):

బతుకమ్మ పండుగ సందర్భంగా ఎల్లమ్మ చెరువుకు వచ్చే మహిళల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేయబడ్డాయని హుస్నాబాద్ పోలీసులు, పురపాలక సంఘం కమిషనర్ ప్రకటించారు.
పోలీసుల సూచన మేరకు వాహనదారులు శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం వద్ద మరియు పశువుల అంగడి స్థలంలోనే తమ వాహనాలను నిలిపివేయాలని స్పష్టంగా తెలిపారు. రోడ్లపై ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలను నిలిపివేయరాదని హెచ్చరించారు. ఎల్లమ్మ చెరువు కట్టకు చేరే వాహనాలు అనభేరి నుండి ఈద్గా మీదుగా సింగిల్ లైన్ లో మాత్రమే ప్రవేశించవలసి ఉంటుంది.
మల్లెచెట్టు వైపు నుంచి ఎల్లమ్మ చెరువుకు వాహనాల రాకపోక పూర్తిగా నిషేధించబడింది. అక్కడి నుంచి కేవలం కాలినడకన బతుకమ్మలతో వచ్చే వారికి మాత్రమే అనుమతి కల్పించబడుతుంది. పార్కింగ్ చేసిన వాహనాలను రద్దీ తగ్గిన తర్వాతనే తిరిగి పట్టణంలోకి వెళ్ళేలా అనుమతి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే గౌరవెల్లి–జనగాం రూట్ లేదా బోడిగేపల్లి–పందిళ్ళ రూట్ ద్వారా ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు.
వాహనదారులు నేరుగా పార్కింగ్ స్థలమైన పశువుల అంగడి లోకి వెళ్లి వాహనాలను నిలిపి, వెంటనే బయటకు రావాల్సి ఉంటుంది. రోడ్డుపై వాహనాలను ఆపితే ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుందని పోలీసులు హెచ్చరించారు.
పురపాలక కమిషనర్ మరియు ఏసీపీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ – “ప్రజల సౌకర్యార్థం చేసిన ఈ ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లకు అందరూ సహకరించి, వాహనాలను కేటాయించిన స్థలాల్లోనే పార్క్ చేయాలి. అలా చేస్తే బతుకమ్మ పండుగ సజావుగా జరుగుతుంది” అని తెలిపారు.





