తల్లి–పిల్లల ఆరోగ్య రక్షణలో అంగన్వాడీలదే కీలక పాత్ర
అంగన్వాడీ సిబ్బందికి యూనిఫాం పంపిణీ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్ యార్డులో గురువారం అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు యూనిఫాంలను మంత్రి పొన్నం ప్రభాకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, “అంగన్వాడీ టీచర్లు తల్లి–పిల్లల ఆరోగ్య రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తే ఆరోగ్యవంతమైన తరం వస్తుంది” అని పేర్కొన్నారు. పౌష్టికాహారం, గుడ్లు, మందులు సమయానికి అందించడం ద్వారా తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. పిల్లలలో రోగనిరోధక శక్తి పెంపొందించేందుకు అంగన్వాడీలు మరింత కృషి చేయాలని సూచించారు. అదే విధంగా గర్భిణీ స్త్రీలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆరోగ్యం మెరుగుపడేలా అధికారులందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలుపుతూ, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు స్టీల్ బ్యాంకులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమవతి, అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, ఆర్డీవో రామ్మూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ పాల్గొన్నారు.





