హుస్నాబాద్‌లో మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంకుల పంపిణీ
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులకు స్టీల్ బ్యాంకుల పంపిణీ కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సతీమణి శ్రీమతి పొన్నం మంజుల పాల్గొని, ప్రతి వార్డు వారీగా మహిళలకు స్టీల్ బ్యాంకులు అందజేశారు. మొత్తం 20 వార్డుల మహిళా సంఘాలకు ఒక్కో వార్డుకు 300 సెట్ల చొప్పున పంపిణీ చేయగా, 6000 సెట్లు లబ్ధిదారులకు చేరాయి. వీటి విలువ రూ.17,27,800/- (పదిహేడు లక్షల ఇరవై ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు)గా అంచనా వేయబడింది. ఈ సందర్భంగా పొన్నం మంజుల మాట్లాడుతూ, మహిళా సంఘాలు ఆర్థిక పరంగా మరింత బలపడాలని, స్వయం సహాయక సమూహాల ద్వారా పట్టణ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని సూచించారు. ట్రస్ట్ తరపున ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని తెలిపారు.





