ఇంజనీరింగ్ విద్యార్థులకు పుస్తకాల పంపిణీ
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

హుస్నాబాద్ శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు పుస్తకాలు, కాలిక్లెటర్లు మరియు ఇతర విద్యా కిట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని రవాణా శాఖ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ రవీందర్ గౌడ్, జోనల్ ప్రెసిడెంట్ మార్గం రవీందర్, ఎంవీఐలైన అపర్ణ, కోల రవీందర్, సైదా, ప్రత్యూష, అమృతలు విద్యార్థులకు కిట్లను అందజేశారు. అసోసియేషన్ కి మంత్రి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ – “హుస్నాబాద్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీకి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాం. విద్యార్థుల కోసం హాస్టల్స్ ఏర్పాటుచేశాం. మౌలిక వసతుల బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది, మీరు బాగా చదవడం మీ బాధ్యత” అని అన్నారు. అలాగే విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక కౌన్సిలింగ్ ఏర్పాటు చేయమని కోరడంతో స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పించామని తెలిపారు. విద్యార్థులు లక్ష్యంతో చదవాలని, గ్లోబల్ స్థాయిలో పోటీ పెరుగుతున్నందున మరింత కృషి చేయాలని సూచించారు. శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీకి రాష్ట్రంలో మంచి గుర్తింపు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వీసీ ఉమేష్ కుమార్, ఆర్డీవో, అధ్యాపకులు, అధికారులు పాల్గొన్నారు.





